
ధన్వంతరీ జయంతి సందర్భంగా విజయవాడలోని సత్యనారాయణ పురంలో గల శిశు విద్యా మందిర్ నందు ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో ధన్వంతరి హోమం జరిగింది. ఈ హోమంలో విజయవాడకు చెందిన పలువురు ఆరోగ్య భారతి కార్యకర్తలు కుటుంబాలతో పాల్గొన్నారు.

అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ఆరోగ్య భారతి అఖిల భారత కార్యదర్శి డాక్టర్ మురళీ కృష్ణ మాట్లాడుతూ అనారోగ్యం వచ్చాక జరగాల్సిన చికిత్స పైన కాకుండా, అసలు వ్యాధులే రాకుండా ఉండడం పైన దృష్టి పెట్టాలని, అందుకోసమే ఆరోగ్య భారతి దేశవ్యాప్తంగా కృషి చేస్తున్నదని తెలిపారు. అనంతరం ఆరోగ్య భారతి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ ద్వాపరయుగంలో దీర్ఘతమ మహర్షి కుమారునిగా ధన్వంతరి జన్మించినట్లుగా చరిత్ర తెలుపుతున్నదని, ఆయుర్వేదానికి మూలపురుషుడైన ధన్వంతరీ జయంతిని “జాతీయ ఆయుర్వేద దినోత్సవం” గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ప్రతి సంవత్సరము ఈ రోజున ఒక వైద్య విషయం పైన దేశవ్యాప్త చర్చ జరిగేలా రూపొందించారని, ఈ ఏడాది ఆయుర్వేదం ద్వారా దీర్ఘాయుష్షు (Ayurveda for longivity) ” జీవేన శరదశ్శతం” అనే అంశంపై చర్చ జరుపుతున్నారని ఆయన పేర్కొన్నారు.


ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసిన ఆరోగ్య భారతి విజయవాడ నగర ఉపాధ్యక్షురాలు డాక్టర్ ఆకెళ్ళ సౌజన్య మాట్లాడుతూ స్త్రీ మాతృ మూర్తిగా సంతానానికి జన్మను ఇవ్వవలసి ఉంటుందని, కనుక స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబంలోని సంతాన మంతా ఆరోగ్యవంతులవుతారని, ఆరోగ్యమే ఎవరికైనా తరగని నిధి అని, తరతరాలకు ఆరోగ్యాన్ని అందించాలంటే ఆ కుటుంబంలోని స్త్రీ మూర్తి ఆరోగ్యంగా ఉండాలని, కనుక గృహిణులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే అదే ఆ కుటుంబానికి శ్రీరామరక్ష అవుతుందని పేర్కొన్నారు. స్త్రీలు ఆరోగ్యం విషయంలో తీసుకోవలసిన పలు జాగ్రత్తలను సూచించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





