
పంజాబ్‌లో రకరకాల పద్ధతుల్లో మత మార్పిడులు పెద్దయెత్తున జరుగుతున్నాయి. డబ్బులు ఆశ చూపించడం, అద్భుతాలు చేస్తామని తప్పుడు వాగ్దానాలు చేయడం, కెనడా, అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వీసాలు ఇప్పిస్తామని ప్రలోభపెట్టడం వంటి చర్యలతో మతం మార్చేస్తున్నారు. పంజాబ్ రాష్ట్ర జనస్వరూపాన్ని మార్చేసేందుకు వ్యవస్థీకృతంగా, ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న కుట్ర అది. దాని ఫలితంగా పంజాబ్ క్రమంగా క్రైస్తవ మెజారిటీ రాష్ట్రంగా మారిపోతోంది.
2011 జనాభా లెక్కల ప్రకారం పంజాబ్‌లో క్రైస్తవుల జనాభా 1.3 శాతం మాత్రమే. అయితే క్రైస్తవ మిషనరీ సంస్థలు, కొన్ని మీడియా సంస్థల తాజా నివేదికల ప్రకారం ఇప్పుడు పంజాబ్‌లో క్రైస్తవుల జనాభా 15శాతానికి పెరిగిపోయింది. ఆ సమస్యను సమర్ధంగా ఎదుర్కొని పరిష్కరించడంలో సిఖ్ఖు నాయకులు, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ వంటి సిక్కు మత సంస్థలూ విఫలమయ్యాయి.
పంజాబ్‌లో ఇప్పుడు క్రైస్తవులు ఎక్కువగా గురుదాస్‌పూర్, అమృత్‌సర్, జలంధర్, లూధియానా, ఫిరోజ్‌పూర్ జిల్లాల్లో క్రైస్తవులు గణనీయంగా పెరిగిపోయారు. ఆ జిల్లాలను ఇప్పుడు ‘చర్చ్ బెల్ట్’ అని పిలుస్తున్నారు. ఆ జిల్లాల్లో వేల సంఖ్యలో చర్చిలు, మిషనరీ కేంద్రాలూ నిర్మించారు. గురుదాస్‌పూర్, హోషియార్‌పూర్ జిల్లాల్లో అయితే అన్ని గ్రామాలూ క్రైస్తవంలోకి మారిపోయాయి. పంజాబ్‌లోని అన్ని గ్రామాల్లోనూ కనీసం రెండు కుటుంబాలను క్రైస్తవంలోకి మతం మార్చేసారు. పంజాబ్ రాష్ట్రంలో 65వేలకు పైగా క్రైస్తవ మిషనరీలు క్రియాశీలంగా ఉన్నారు. ఒక్క జలంధర్ నగరంలోనే 1500కు పైగా చర్చిలు ఉన్నాయి.
రాజూ రంగీలా, బాజీందర్ సింగ్, అంకుర్ నరులా వంటి పాస్టర్లు హిందూ, సిఖ్ఖు మతాలలోని దళితులను క్రైస్తవంలోకి మతం మార్చేసారు. తమను తాము పాస్టర్లుగా, అపోస్తలులుగా ప్రకటించుకున్న వారు ‘చంగీ సభ’ల పేరుతో కూటములు నిర్వహిస్తుండడం ఆందోళనకరమైన పరిణామం.
ఈ మోసకారి పాస్టర్లు తప్పుడు విధానాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. అద్భుతాలు చేస్తున్నట్లు నటించడం నటింపజేయడం, రోగాలు తగ్గించగలమంటూ హామీలివ్వడం, చనిపోయిన వారిని బతికిస్తామని చెప్పడం, ఆర్థిక సమస్యలు పరిష్కరిస్తామనడం వంటి మోసపూరిత విధానాలతో అమాయకులైన దళితులు, వాల్మీకి హిందువులు, మజహబీ సిఖ్ఖులను తప్పుదోవ పట్టించి మతం మార్చేస్తున్నారు. ఈ పాస్టర్లు, చర్చి నేతలూ సిఖ్ఖు కీర్తనలను పోలిన బాణీలలో ఏసుక్రీస్తు మీద పాటలు స్వరపరుస్తున్నారు. వాటిద్వారా హిందువులను మభ్యపెడుతున్నారు. విదేశాలకు వెళ్ళాలనే ఆత్రుతలో ఉండే పంజాబీ యువత ఈ మత మార్పిడి ముఠాలకు సులువుగా దొరికే మొదటి లక్ష్యాలు. క్రైస్తవంలోకి మతం మారితే వీసాలు సులువుగా వస్తాయంటూ ప్రలోభపెడతారు.
హిందువులు, సిఖ్ఖులను మతం మారేలా చేసే మరో ప్రధాన కారణం మజహబీ సిఖ్ఖులు, దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలను సామాజికంగా, రాజకీయంగా నిర్లక్ష్యం చేయడం. నిజానికి సమానత్వం, సమన్యాయం అనే నియమాల మీదనే ఏర్పడినా, సిఖ్ఖు మతంలో కుల వివక్ష కొనసాగుతోంది. అగ్రవర్ణ సిఖ్ఖులు, దళిత సిఖ్ఖుల పట్ల వివక్ష చూపిస్తుండడం కూడా వారిని క్రైస్తవం వైపు ఆకర్షితులను చేస్తోంది. క్రైస్తవంలో వారికి ఆమోదం, గౌరవం లభిస్తాయని చెప్పి మతం మారుస్తున్నా, నిజానికి ఆ మతంలో కూడా అవే అవమానాలూ, వివక్షా కొనసాగుతున్నాయి.
సిఖ్ఖుల మీద ప్రభావం చూపుతున్న మరో అంశం వోకిజం. ప్రస్తుతం పంజాబ్ చాలా వేగంగా వోకిజం వంటి పాశ్చాత్య ధోరణులను అలవరచుకుంటోంది. ఫలితంగా సుసంపన్నమైన దేశీయ సిఖ్ఖు సంస్కృతి, సంప్రదాయిక విలువలు, ఆధ్యాత్మిక వారసత్వం క్రమంగా క్షీణించిపోతున్నాయి.





