News

జమ్ముకశ్మీర్‌ సమస్యలపై మాట్లాడే అర్హత ఏ ఇతర దేశానికీ లేదు: విదేశాంగ శాఖ

255views

భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య సంఘర్షణ ఎల్లప్పుడూ సంప్రదాయ విధానంలోనే ఉందని, అణు దాడుల గురించి దాయాది నుంచి ఎటువంటి సంకేతాలు రాలేదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు, ఆపరేషన్‌ సిందూర్‌ గురించి విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘానికి మిస్రీ వివరించారు. కాల్పుల విరమణ నిర్ణయం ద్వైపాక్షిక స్థాయిలోనే తీసుకున్నారని పునరుద్ఘాటించారు. ఈ వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదనలను కొంతమంది ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తగా.. మిస్రీ ఈమేరకు స్పందించారు.

‘‘పహల్గామ్‌ దాడి ఘటనపై దర్యాప్తులో కీలక వివరాలు వెల్లడయ్యాయి. పాక్‌లోని సూత్రధారులతో ఉగ్రవాదులు సంభాషించినట్లు దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదులు పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. భారత్‌పై హింసను ప్రేరేపిస్తున్నారు. పాక్‌ సీమాంతర ఉగ్రవాదం గురించి భారత్‌ ఆందోళన చెందుతోంది. జమ్ముకశ్మీర్‌ సమస్యలపై మాట్లాడే అర్హత ఏ ఇతర దేశానికీ లేదు’’ అని విక్రమ్‌ మిస్రీ పేర్కొన్నారు.