News

ఈ దేశం ధర్మశాల కాదు.. శ్రీలంక పౌరుని పిటిషన్‌‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు.

304views

ప్రపంచంలోని అందరికీ ఉచితంగా ఆశ్రయం ఇవ్వడానికి ఈ దేశం ధర్మశాల కాదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శరణార్ధిగా తనకు ఇండియాలో ఆశ్రయం ఇవ్వాలని శ్రీలంక జాతీయుడు ఒకరు చేసిన అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం-LTTEతో సంబంధాలున్నాయనే అనుమానంతో 2015లో పిటిషనర్‌ను అరెస్టు చేశారు. తనను శరణార్థిగా పరిగణించాలని కోరుతూ అతను వేసిన తాజా పిటిషన్‌పై న్యాయమూర్తులు దీపాంకర్ దత్తా, జస్టిస్ కె.వినోద్ చంద్రతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

శ్రీలంక జాతీయుడికి 2018లో విచారణ కోర్టు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద పదేళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో మద్రాసు హైకోర్టు అతని జైలుశిక్షను ఏడేళ్లకు తగ్గించింది. శిక్ష పూర్తికాగానే దేశం విడిచి వెళ్లాలని, దేశం విడిచివెళ్లడానికి ముందు శరణార్ధి శిబిరంలో ఉండాలని ఆదేశించింది. కాగా, సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా పిటిషనర్ తన వాదన వినిపించారు. వీసాతో తాను ఇండియా వచ్చానని, తన ప్రాణాలకు స్వదేశంలో ముప్పు ఉందని కోర్టుకు విన్నవించారు. తన భార్య, పిల్లలు ఇండియాలో స్థిరపడ్డారని, ఇప్పటికి తాను మూడేళ్లుగా నిర్బంధంలో ఉన్నానని, డిపోర్టేషన్ ప్రక్రియ మొదలు కాలేదని చెప్పారు.

దీనిపై జస్టిస్ దత్తా స్పందిస్తూ.. ”ప్రపంచంలోని శరణార్ధులందరికీ ఇండియా ఆతిథ్యం ఇవ్వాలా? ఇప్పటికే 140 కోట్ల జనాభాతో ఉన్నాం. విదేశీయులందరికీ ఇక్కడ ఆశ్రయం ఇవ్వడానికి ఇదేమీ ధర్మశాల కాదు” అని అన్నారు. ఇందుకు ప్రతిగా పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదన వినిపిస్తూ, ఈ అంశం రాజ్యాంగంలోని 21, ఆర్టికల్ 19 కిందకు వస్తుందన్నారు. దీనిపై జస్టిస్ దత్తా మాట్లాడుతూ, పిటిషనర్‌ను చట్టప్రకారమే కస్టడీలోకి తీసుకున్నందున అతని నిర్బంధం ఆర్టికల్ 21ని ఉల్లంఘించినట్టు కాదన్నారు. ఆర్టికల్ 19 అనేది భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ”ఇక్కడ సెటిల్ కావడానికి మీకున్న హక్కు ఏంటి?” అని కోర్టు ప్రశ్నించింది. అతను శరణార్థని, అతని ప్రాణాలకు శ్రీలంకలో ప్రమాదం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించగా, మరో దేశానికి వెళ్లండి అంటూ ధర్మాసనం స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.