News

దేశ రక్షణే పరమ పుణ్యం, పరమ వ్రతం…

256views

ప్రపంచంలోని హిందూ మహిళలను విశ్వసేవికా సమితి సంఘటితం చేస్తూ వస్తోందని రాష్ట్రీయ సేవికా సమితి అఖిల భారతీయ బౌద్ధిక్ ప్రముఖ్ లీనా గోవింద్ గహానే అన్నారు. సాధన అనేది కొత్తేమీ కాదని, ఎప్పటి నుంచో మనకు వస్తున్న సంప్రదాయమన్నారు. ఇలాంటి శిక్షణల ద్వారా అనేక మంది సేవికల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతందన్నారు. ఈ ఆత్మ విశ్వాసంతో సమాజానికి సుదృఢమైన నాయకత్వాన్ని అందిస్తారన్నారు.

రాష్ట్ర సేవికా సమితి తెలంగాణ ప్రాంతం ఆధ్వర్యంలో ప్రవేశ్ శిక్షా వర్గ హైదరాబాద్ నాదర్‌గుల్‌లో ఉన్న విబివికె మైదానంలో జరిగింది. ఈ సందర్భంగా సేవికలు చేసిన శారీరిక్, సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా రాష్ట్రీయ సేవికా సమితి అఖిల భారతీయ సహ బౌద్ధిక్ ప్రముఖ్ మాననీయ లీనా గోవింద్ గహానే హాజరయ్యారు. అలాగే ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యురాలు భారతి కులకర్ణి వ్యవహరించారు.

లీనా గోవింద్ గహానే మాట్లాడుతూ… దేశ వ్యాప్తంగా వేల మంది సేవికలు అచ్చు ఇలాంటి శిక్షణనే పొందుతారని, శాఖల ద్వారా కొత్త కొత్త సేవికలు సమతికి వస్తుంటారన్నారు. సేవికా సమితి కార్య పద్ధతి ఏమిటి? సేవికా సమితి అంటే ఏమిటి? శాఖ అంటే ఏమిటి? గీత్ అన్న మాధ్యమంగా జాతీయ భావాలు, దేశభక్తి ఎలా జాగృతం అవుతాయో తదితర విషయాలు వారికి పరిచయం అవుతాయని అన్నారు. ఈ ప్రారంభిక్ శిక్షా వర్గ తర్వాత… కార్య క్షేత్రంలో సేవికా సమితి కార్యాన్ని విస్తరించడానికి తయారవుతారని, దీనినే ప్రవేశ శిక్షావర్గ అని పిలుచుకుంటామన్నారు. ఇది 15 రోజుల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు.

శారీరిక్, బౌద్ధిక్, ఆధ్యాత్మిక కోణంలో సేవికల వికాసం జరగాలని, వీటి ఆధారంగానే ప్రశిక్షణ కొనసాగుతుందన్నారు.అందులో మొదటిది మైదానం కేంద్రంగా అభ్యాసాలు, ప్రశిక్షణలు కొనసాగుతాయని, అలాగే బౌద్ధిక్ కాలాంశాలు వుంటాయని, అందులో చర్చలు, కార్యశాలలు వుంటాయని, వీటి ద్వారా సేవికల బౌద్ధిక్ కి సంబంధించిన వికాసం జరుగుతుందని వివరించారు. సమాజంలో జరుగుతున్న విషయాలు, ధర్మానికి, సంస్కృతి విషయాలపై కాలాంశాల ద్వారా తెలుసుకుంటారన్నారు.ఆ తర్వాత ప్రబోధ వర్గ జరుగుతుందని, ఆ తర్వాత తృతీయ వర్ష జరుగుతుందని వివరించారు. భారత్ లో 5,000 శాఖలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే మిళన్, సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు.

దేశ రక్షణే పరమ పుణ్యం, పరమ వ్రతం, అదే యాగమని ఇదే ప్రస్తుత పరిస్థితి అని వివరించారు. ఇప్పుడు దేశభక్తిని ఆచరణలో చూపించాల్సిన సమయమని, ఇదే దేశం అందర్నీ అడుగుతోందన్నారు. దేశ రక్షణకు ఎల్లప్పుడూ సిద్ధంగా వుండాలన్న భావన రావడానికే సమితి కార్యకర్తలు శాఖకు వస్తుంటారని అన్నారు. ఈ గంట శాఖతో సమాజంతో ఎలా నడుచుకోవాలో తెలుస్తుందన్నారు. అలాగే సమాజ కార్యం చేయడానికి ఓ క్రియాశీలమైన పౌరునిగా పనిచేయాలన్న తపన, స్పృహ కూడా పెరుగుతుందన్నారు. అలాగే సమితి నడిపే శాఖల ద్వారా సజ్జన శక్తి జాగృతం అవుతుందన్నారు.

ఏ శత్రువు అయినా మనల్ని ఆక్రమించాలని చూస్తే.. దానికి సరైన జవాబు ఇవ్వాల్సిన అవసరం వుందని చెప్పారు. పహల్గాంలో పౌరులపై ఉగ్రదాడి జరిగిందని, దీంతో దేశం మొత్తం విచారం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. దీని తర్వాత ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వానికి అండగా వున్నారని, సైన్యానికి నైతిక స్థైర్యాన్ని అందించి, సైన్యం వెంటనే ప్రజలు నిలిచారన్నారు. దీని తర్వాతే ఆపరేషన్ సిందూర్ జరిగిందని, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం జరిగిందన్నారు. సిందూర్ ఆపరేషన్ కి ఇద్దరు మహిళలు నాయకత్వం వహించారన్నారు.

ఈ భారత్ కేవలం భూమి మాత్రమే కాదని, తల్లివంటిదని, మనము బిడ్డలం అని అన్నారు. ఈ దృష్టికోణం అందరికీ వుండాలన్నారు. చాలా సంవత్సరాల నుంచి మాతృభూమిని ఆరాధిస్తున్నామని, దీంతో భారతీయ సంస్కృతి వెల్లివిరిసిందన్నారు. ఇదే సంస్కృతి వసుదైక కుటుంబకం అన్న మంత్రాన్ని ఇచ్చిందని, ఈ భావన ఇదే గడ్డపై వికసించిందన్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా హిందూ సంస్కృతివైపే చూస్తున్నారని, అర్థం చేసుకోవాలని అనుకుంటున్నారని తెలిపారు.


రానూ రానూ పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నామని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ కూడా చెప్పుతున్నారన్నారు. అయితే.. స్వదేశీ మంత్రాన్ని పాటించినప్పుడే ఇది సాధ్యమైతుందన్నారు. భారత్ లోని వ్యాపారులు చిన్న చిన్నగా ఎదగడం ప్రారంభిస్తే.. అంతర్జాతీయ మార్కెట్ లో మన రూపాయి విలువ పెరుగుతుందన్నారు. దీంతో బీదలు కూడా మెళ్లి మెళ్లిగా తగ్గుతారని, దీంతో ఆత్మ నిర్భర భారత్ సాధ్యమవుతుందన్నారు. ఇది అమృత కాలమని, యువకులు భారత్‌ను మన మూలాల ఆధారంగా ముందుకు తీసుకెళ్లాలని, అప్పుడే భారత్ విశ్వగురు స్థానానికి చేరుకుంటామన్నారు. అందుకే ముందుకు వచ్చి దేశ సేవ చేయాలని ,ఇది నైతిక బాధ్యత అని అన్నారు.

కొందరు భారత్‌ను ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని, ఈ జాబితాలో కొందరు బయట వుంటే, మరికొందరు దేశంలోనే వుంటూ, ఇబ్బందులు పెడుతున్నారన్నారు. దేశంలో మాక్ డ్రిల్ జరిగిందని, దీంతో సమాజంలో జాగరణ జరిగిందన్నారు. దేశ రక్షణ అనేది కేవలం సైనికుడి పని మాత్రమే కాదని, తమది కూడానని పౌరులకు తెలిసివచ్చిందన్నారు. దీనికి సజ్జన శక్తి కూడా జాగృతం కావాలన్నారు. ఈ సమాజంలో ఆత్మ విశ్వాసాన్ని తీసుకురావాల్సిన బాధ్యత సేవికలపై వుందన్నారు. దేశం సురక్షితంగా వుంటే, వికసిత భారత్ సాధ్యమవుతుందన్నారు. ఇదేమీ పెద్ద దూరంలో లేదన్నారు. ప్రస్తుతం అహిల్యాబాయి త్రిశతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయని, ఆమె కేవలం కుటుంబానికి మాత్రమే అమ్మగా వుండేది కాదని, మొత్తం రాజ్యానికే అమ్మలా నిలిచిందన్నారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ధర్మ కార్యక్రమాలు కూడా చేపట్టారన్నారు.

మరోవైపు ఈ వర్గ నివేదికను శ్రీమతి భాస్కర లక్ష్మి చదివి వినిపించారు.ఈ 9 భాగ్ లు, 21 జిల్లాల నుంచి 102 మంది శిక్షార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఇక భారతి కులకర్ణి అధ్యక్ష భాషణం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వర్గను చూసి చాలా ఆనందంగా అనిపిస్తోందన్నారు. శారీరక, బౌద్ధిక, మానసిక వికాసం కోసం ఎలాంటి కార్యక్రమాలు రూపొందించారో చూశానని తెలిపారు. దేశం అమృత్ కాలంలో వుందని, 2047 నాటికి వికసిత్ భారత్ అవుతుందని మోదీ చెపుతుంటారన్నారు. వికసిత భారతం కోసం అందరూ తమవంతు కృషి చేయాలన్నారు. తన, మన ధనంగా చాలా దృఢంగా వుంటేనే సాధ్యం అవుతుందన్నారు.