
ఆపరేషన్ సిందూర్‌ను జీర్ణించుకోలేని పాకిస్థాన్.. మనదేశం మీదకు క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ తర్వాత అక్కసుతో పంజాబ్‌లో అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుందని మేజర్ జనరల్ కార్తిక్ సి శేషాద్రి వెల్లడించారు. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టామని తెలిపారు.
మన ఆపరేషన్ తర్వాత పాక్ దాడులకు పాల్పడుతుందని భారత సైన్యం అంచనా వేసింది. మిలిటరీ టార్గెట్లతో పాటు పౌరులకు చెందిన సదుపాయాలు, మతపరమైన ప్రాంతాలపై రెచ్చగొట్టే చర్యలు ఉండొచ్చని ఊహించింది. ‘‘పాక్‌కు ఎలాంటి కచ్చితమైన లక్ష్యాలు లేవని తెలుసు. గోల్డెన్ టెంపుల్‌ను లక్ష్యంగా చేసుకొనే అవకాశాలు కనిపించాయి. ముందుగానే ఊహించడంతో దానికి అదనపు రక్షణ కల్పించాం. పూర్తిగా సిద్ధమయ్యాం. మన ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ గన్నర్స్.. పాకిస్థాన్ సైన్యం ప్రణాళికలను తిప్పికొట్టారు. మన స్వర్ణ దేవాలయంపై ఒక్క గీత కూడా పడకుండా అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేశారు’’ అని మేజర్ జనరల్ వెల్లడించారు.
‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత సైన్యం పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ మెరుపు దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. దాంతో వందలాదిగా పాక్ డ్రోన్స్, మిసైల్స్‌ను భారత్‌పై ప్రయోగించింది. మన ఎస్-400, ఆకాశ్ తదితర మన గగనతల రక్షణవ్యవస్థలు అద్భుతరీతిలో వాటిని నేలమట్టం చేశాయి. వాటిని ఎక్కడికక్కడ కూల్చేశాయి. దానికి సంబంధించిన వీడియోను వెస్ట్రన్ కమాండ్ పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక పాక్ డ్రోన్లు, మిస్సైళ్ల శకలాలు చెల్లాచెదురుగా పడిన వీడియోలు పెద్దఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.





