గగనతల రారాజు పాక్ ఎయిర్‌ఫోర్స్ అంట.. ఫేక్ వార్తను ప్రచారం చేస్తూ నవ్వులపాలైన పాక్ ఉప ప్రధాని

ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్‌తో భారత సైన్యం పాక్‌ను చావుదెబ్బ తీసింది. ఆ దేశంలోని ఉగ్ర స్థావరాలు, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. భారత్ దాడితో తోకముడిచిన దాయాది.. చివరికి కాళ్లబేరానికి వచ్చింది. అయితే, తమకు జరిగిన నష్టాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాక్ నేతలు తహతహలాడుతున్నారు.
ఈ క్రమంలో పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఏకంగా పార్లమెంట్ సాక్షిగా నవ్వులపాలయ్యారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ ఎయిర్‌ఫోర్స్‌ను విదేశీ మీడియా గొప్పగా ప్రశంసించిందంటూ ప్రకటించుకున్నారు. పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను కీర్తిస్తూ అంతర్జాతీయ మీడియా సంస్థలు పలు కథనాల్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన ‘డైలీ టెలిగ్రాఫ్’ అందుకు భిన్నంగా ‘ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ వ్యవహరించిన తీరును ప్రశంసిస్తూ ఓ కథనాన్ని ప్రచురించింది’ అంటూ ఆ పత్రిక హెడ్‌లైన్‌ను సెనేట్‌లో చూపించి గొప్పలు చెప్పుకున్నారు ఇషాక్ దార్.
మే 10వ తేదీన ఫ్రెంట్ పేజిలో ‘ఆకాశంలో ఎదురులేని రారాజు.. పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్’ పేరుతో ఆ కథనం ఉంది. ఇది నిజమని నమ్మిన సభ్యులు చప్పట్లతో పాక్ సైన్యాన్ని మెచ్చుకున్నారు. దీనిపై స్పందించిన పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం అసలు నిజాన్ని బయటపెట్టింది. అది ఏఐ జనరేటెడ్ ఇమేజ్ అని తేల్చింది. మరోవైపు ఆ దేశ మీడియా ‘డాన్’ సైతం అది ఫేక్ అని తేల్చింది. ఆ పత్రిక ఎప్పుడూ అలాంటి కథనాల్ని ప్రచురించలేదని తేల్చింది. దీంతో ఫేక్ వార్తను నిజమని నమ్మించాలని చూసి తానే బొక్కబోర్లా పడ్డట్లైంది ఇషాక్ దార్ పరిస్థితి. ఇక ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్న పాక్ పాలకులపై సొంత దేశంలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.




