
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారత ప్రభుత్వం 1960లో భారత్-పాకిస్తాన్ మధ్య సంతకం చేయబడిన సింధు జల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం జాతీయ భద్రతా కారణాలు, పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందని ఆరోపణల నేపథ్యంలో తీసుకోబడింది. ఈ ఒప్పందం ప్రకారం, సింధూ నదీ వ్యవస్థలోని తూర్పు నదులు (రవి, బియాస్, సట్లెజ్) భారత్‌కు, పశ్చిమ నదులు (సింధూ, జీలం, చీనాబ్) పాకిస్తాన్‌కు కేటాయించబడ్డాయి. ఈ ఒప్పందం ద్వారా పాకిస్తాన్ సుమారు 80% నీటిని పొందుతుంది. ఇది ఆ దేశ వ్యవసాయ రంగానికి కీలకంగా ఉంది.
అయితే భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకొని నీటిని నిలిపివేసింది. భారత ప్రభుత్వం సిందూ నదీ జలాల నిలిపివేత నిర్ణయానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా నిరసనలకు దిగింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్‌లో సింధు జల ఒప్పందం రద్దును వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. కాగా సీపీఐ నిరసనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో వారు.. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని “దేశ వ్యతిరేక” చర్యగా వర్ణిస్తూ.. పాకిస్తాన్‌కు నీటి సరఫరా కొనసాగించాలని డిమాండ్ చేయడం కనిపించింది. ఈ నిరసనలు ప్రధానంగా కోల్‌కతాతో సహా పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాలలో జరిగినట్లు తెలుస్తోంది.





