ArticlesNews

జాతీయోద్య‌మానికి తొలి మెట్టు.. సిపాయిల తిరుగుబాటు

449views

(మే 10 – ప్ర‌థ‌మ స్వాతంత్ర్య సంగ్రామం)

బ్రిటిష‌ర్ల పాల‌న, వారి విధానాల‌కు వ్య‌తిరేకంగా జ‌రిగిన 1857 సిపాయిల తిరుగుబాటు జాతీయోద్య‌మానికి తొలి మెట్టుగా నిలిచింది. ప్ర‌థ‌మ స్వాతంత్ర్య సంగ్రామంగా ప్ర‌సిద్ధికెక్కిన ఈ ఉద్య‌మం మీర‌ట్‌లో 1857 మే 10న మొద‌లైంది. దీనికి ముఖ్య కార‌ణం రాజ్య సంక్ర‌మ‌ణ సిద్ధాంత‌మైతే సైన్యంలో ఎన్‌ఫీల్డ్ రైఫిళ్ల‌ను ప్ర‌వేశ పెట్ట‌డం త‌క్ష‌ణ కార‌ణంగా నిలిచింది. ఉత్త‌ర భార‌తంలో ఈ తిరుగుబాటు అలీపూర్‌, మొయిన్‌పురీ, బులంద్ శ‌హ‌ర్‌, మ‌ధుర‌, అట్ట‌క్ త‌దిత‌ర ప్రాంతాల్లో ఉధృతంగా జ‌రిగింది. ముఖ్యంగా బెంగాల్‌లో గ్రామ గ్రామానికీ కార్చిచ్చులా వ్యాపించింది. ఆ స‌మ‌యంలో సిపాయిలు మొత్తం 2,30,000 మంది ఉన్నారు. వీరికి ఆనాటి స్థానిక రాజులు, జ‌మీందారులు, భూస్వాముల సైన్యం స‌హ‌క‌రించింది. పోరాటం కేవలం ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితమైందని, అది కేవలం సైనికుల తిరుగుబాటు అని తప్పుడు ప్రచారం చేశారు. నిజానికి, దేశం మొత్తం ఈ స్వాతంత్య్ర పోరాటంలో సమిష్టిగా పోరాడింది. సైనికులు, భూస్వాములు, రైతులు, కార్మికులు, దళితులు, మహిళలు, మేధావులు అందరూ ఇందులో పాల్గొన్నారు.

ఎన్‌ఫీల్డ్ తుపాకుల వినియోగంపై ఔరంగాబాద్‌లోని సిపాయిల్లో నెల‌కొని ఉన్న తీవ్ర అసంతృప్తికి ఈ తిరుగుబాటు ఆజ్యం పోసింది. దీన్ని గుర్తించి ఈస్టిండియా కంపెనీ అధికారులు 1857 జూన్ 23న 90మంది సైనికుల‌ను నిరాయుధుల‌ను చేసి జైలుకు పంపారు. ఆ త‌ర్వాత దేశంలోని ప‌లు ప్రాంతాల‌కు విస్త‌రించిన ఈ ఉద్య‌మంలో నానా సాహెబ్, తాంతియా తోపే, రాణి లక్ష్మీబాయి, రాంగో బాపూజీ గుప్తే, బహదూర్ షా జఫర్ వంటి నాయకులు కీలక పాత్ర పోషించారు. అయితే స‌రైన నాయ‌కత్వం లేక‌పోవ‌డం, వ్యూహ‌ర‌చ‌నలో వైఫ‌ల్యంతో బ్రిటిష్ పాల‌కులు ఈ తిరుగుబాటును ఎక్క‌డిక్క‌డే క‌ర్క‌శంగా అణ‌చివేశారు. భార‌తీయ సిపాయిల నేతృత్వంలో 1857 మే 10న మొద‌లైన బ్రిటిష్ వ్య‌తిరేక తిరుగుబాటు 1858 అక్టోబ‌రు నాటికి అణ‌చివేత‌కు గురైంది. అయితే బ్రిటిష‌ర్ల ప‌క్ష‌పాత వైఖ‌రి, స్వార్థ‌పూరిత విధానాల‌పై ప్ర‌జ‌ల్లో ఉన్న అసంతృప్తిని తెలియ‌జేయ‌డంలో మాత్రం విజ‌యం సాధించింది.

1857 తిరుగుబాటుకు రాజకీయ, సాంఘిక, మత, ఆర్థిక, సైనిక ఇలా పలు కారణాలు ఉన్నాయి. డల్హౌసీ విధానాలు, సనాతన ధర్మం పై దాడి, నిర్బంధ క్రైస్తవ మత బోధన, మ‌త మార్పిడులు, స్వదేశీ రాజ్యాల ఆక్రమణ, ఆంగ్ల సైనికులతో పోల్చితే భారత సిపాయిల జీత భత్యాల్లో భారీ వ్యత్యాసంతో పాటు బ్రిటిష‌ర్ల పాల‌న నుండి మాతృభూమికి విముక్తి కలిగించాలనే బ‌ల‌మైన కాంక్ష‌… ఇవ‌న్నీ క‌లిసి మొదటి స్వాతంత్ర్య సంగ్రామానికి బాట‌లు వేశాయి. ఈ ఉద్యమం ఫ‌లితంగా దేశంలో ఈస్టిండియా కంపెనీ పాల‌న ర‌ద్ద‌యి, బ్రిటిష్ సార్వ‌భౌమాధికారం ప్రారంభ‌మైంది. ఈ మేర‌కు 1985 న‌వంబ‌రు 1న విక్టోరియా మ‌హారాణి ప్ర‌క‌టించింది. భార‌త్‌లో రాజ ప్ర‌తినిధిగా గ‌వ‌ర్న‌ర్ జ‌న‌ర‌ల్ నియమితుడ‌య్యాడు.

భారతీయులు చేపట్టిన ఈ ఉద్య‌మాన్ని మొదటి స్వతంత్ర పోరాటంగా సూత్రీకరిస్తూ భార‌త స్వాతంత్ర్య సంగ్రామం 1857` పేరుతో వీర సావ‌ర్క‌ర్ 24 ఏళ్ల వయసులో రాసిన గ్రంథాన్ని బ్రిటిష‌ర్లు ప్ర‌చుర‌ణ‌కు ముందే నిషేధించారు. ఈ నిషేధం దాదాప 40 ఏళ్ల పాటు కొన‌సాగింది. చివ‌ర‌కు నెద‌ర్లాండ్స్‌ల‌తో ఈ పుస్త‌కాన్ని ముద్రించి, ర‌హ‌స్య మార్గాల్లో భార‌త్‌కు త‌ర‌లించారు. ఆ తర్వాత ‘విప్లవకారుల గీత’గా పేరు తెచ్చుకున్న ఈ గ్రంథం అనేక భాషల్లోకి అనువాదమైంది. అప్ప‌ట్లోనే ఒక్కో ప్రతి రూ 300కు అమ్ముడైంది. దీనిద్వారా భారతీయులలో స్వతంత్రం సాధించ‌గలమనే ఆత్మవిశ్వాసాన్ని సావ‌ర్క‌ర్‌ నింపారు. మొత్తం ప్రపంచానికి భారతీయుల పోరాట ప్రతిమను పరిచయం చేశారు. ఈ పుస్తకాన్ని ఆజాద్ హింద్ ఫౌజ్ శిబిరాల్లో తప్పనిసరిగా చదివేవారు. మన స్వాతంత్ర్య సంగ్రామానికి సంబంధించి సావర్కర్ ఇలా అన్నారు. “పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనే శక్తిసామర్థ్యాలు కొంతమందికి ఉండకపోవచ్చు.. అయినా తమ మాతృభూమికి బానిస సంకెళ్ల నుంచి విముక్తి కలిగించమని వారు కూడా ప్రార్థించే ఉంటారు. ఆ విధంగా వారు కూడా సంగ్రామంలో పాలుపంచుకున్నారనే చెప్పాలి. వారికీ ఈ పోరాటంలో స్థానం ఉన్న‌ట్లే..“.