
ఎర్రకోటను తనకు అప్పగించాలని మొఘల్ చక్రవర్తుల వారసురాలు చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చిట్టచివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్-2 మునిమనవడు బెదర్ భక్త్ భార్య సుల్తానా బేగం దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై దిగ్బ్రాంతికి గురైన సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ‘ఎర్రకోట మాత్రమే ఎందుకు? ఫతేపూర్ సిక్రీ, తాజ్‌మహల్‌లను ఎందుకు అడగట్లేదు?.. మీరు దీని గురించి వాదించాలనుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు. పిటిషన్‌ను కొట్టివేశారు. సుల్తానా బేగం ప్రస్తుతం కోల్‌కతా సమీపంలోని హౌరాలో నివసిస్తున్నారు.
ఎర్రకోటకు అసలైన యజమానులైన మొఘల్ చక్రవర్తుల ప్రత్యక్ష వారసురాలు అనే కారణంతో దాన్ని తనకు అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం తనకు ఆర్థిక సాయం చేయాలని ఆమె కోరారు. కాగా, సుల్తానా బేగం ఈ అంశంపై కోర్టును ఆశ్రయించడం ఇదే తొలిసారి కాదు. 2021లో ఆమె ఇదే డిమాండ్‌తో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన భర్త మొఘల్ వారసుడని, బహదూర్ షా వారసుడిగా బెదర్ ను 1960లో ప్రభుత్వమే గుర్తించిందని చెప్పారు. ఆమె అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.





