News

పాక్‌ లోని పలు సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడి చేసిన భారత్‌

250views

పాక్‌ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతోందని ఆర్మీ ప్రతినిధి సోఫియా ఖురేషీ పేర్కొన్నారు. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఘర్షణలపై విదేశాంగశాఖ, మిలిటరీ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దీనిలో విదేశాంగశాఖ ప్రతినిధి విక్రమ్‌ మిస్రీ, సైన్యానికి చెందిన కర్నల్‌ సోఫియా ఖురేషీ, వాయుసేనకు చెందిన వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌ పాల్గొన్నారు.

తొలుత కర్నల్‌ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ ‘‘పశ్చిమ సరిహద్దుల్లో పాక్‌ నిరంతరం దాడులు చేస్తోంది. డ్రోన్లు, దీర్ఘశ్రేణి ఆయుధాలు, లాయిటరింగ్‌ మ్యూనిషన్‌, ఫైటర్‌ జెట్లను వాడి.. భారత మిలిటరీ స్థావరాలపై దాడులు చేస్తోంది. అయితే వాటిని భారత్‌ తిప్పికొట్టింది. కానీ, 26 చోట్ల పాక్‌ ఆయుధాలు గగనతలంలోకి చొచ్చుకొచ్చాయి. అవి ఉధంపుర్‌, భుజ్‌, పఠాన్‌కోట్‌, భఠిండా వాయుసేన స్థావరాల్లోని పరికరాలను దెబ్బతీసి, సిబ్బందిని గాయపర్చాయి. తెల్లవారుజామున 1.40 సమయంలో పాక్‌ హైస్పీడ్‌ మిసైల్స్‌తో పంజాబ్‌లోని వాయుసేన స్థావరాలపై దాడులు చేసింది. శ్రీనగర్‌, అవంతిపుర, ఉధంపుర్‌లో వైద్య కేంద్రాలపై దాడి చేసింది. ఇది రెచ్చగొట్టే చర్య అని కచ్చితంగా తెలుస్తోంది’’

‘‘దీనికి తగినట్లు ప్రతిస్పందిస్తూ.. భారత దళాలు పాక్‌లోని మిలిటరీ స్థావరాలు, రాడార్లు, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లపై దాడులు చేసింది. వీటిల్లో రఫీకీ, మురిద్‌, చక్లాల, రహిమ్‌ యార్‌ ఖాన్‌, సుక్కుర్‌, చునియాన్‌ స్థావరాలు ఉన్నాయి. ఫైటర్‌ జెట్లతో అత్యంత కచ్చితంగా లక్ష్యాలు ఛేదించే ఆయుధాలు వాడి ఈ దాడులు నిర్వహించాము. పస్రూర్‌లో రాడార్‌ కేంద్రం, సియాల్‌ కోట్‌లోని ఏవియేషన్‌ బేస్‌ను ధ్వంసం చేశాము. ఈ దాడుల సందర్భంగా పౌరులు ప్రాణాలు పోకుండా చాలా జాగ్రత్తలు తీసుకొన్నాం’’

‘‘పాక్‌ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతోంది. ఇది పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదకర చర్య’’ అని పేర్కొన్నారు. ఇదే అంశాన్ని వ్యోమికా సింగ్‌ అంతర్జాతీయ మీడియా కోసం ఆంగ్లభాషలో వెల్లడించారు. భారత స్థావరాలు సురక్షితంగా ఉన్నాయని టైమ్‌ స్టాంప్‌లు ఉన్న వీడియోలు, ఫొటోలను ప్రదర్శించారు.

విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ మాట్లాడుతూ.. ‘శిర్సా, సూరత్‌ఘర్‌ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశామని పాక్‌ చెప్పడం పూర్తిగా తప్పు. దీంతోపాటు ఆదంపుర్‌లోని ఎస్‌-400 , బ్రహ్మోస్‌ మిసైల్‌ డిపో, పలుచోట్ల ఎయిర్‌ఫీల్డ్‌లను ధ్వంసం చేసినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తోంద’’న్నారు. ప్రజలు ఇలాంటి వాటిని నమ్మొద్దని చెప్పారు.