News

హిందూ దేవాలయాల పరిరక్షణకై ఉద్యమిస్తాం

617views

శ్రీకాకుళం నగరంలోని హయాతి నగరం లక్ష్మీ టాకీస్ వద్దగల శ్రీ జగన్నాథ స్వామి ఆలయానికి చెందిన భూమిని ఆక్రమణల నుంచి రక్షించాలని , లేకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పూనుకుంటామని హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ శ్రీ పైలా చంద్రశేఖర్, జిల్లా ప్రముఖ్ శ్రీ సురేష్ సింగ్ దేవాదాయ శాఖను హెచ్చరించారు. ఈ మేరకు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కు వారు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇటీవల దేవాదాయ భూములను పేదలకు పంచి పెడతామని చేసిన ప్రకటనతో కొందరు ఈ భూముల్లో గుడిసెలు వేసుకొని విద్యుత్ సదుపాయం కూడా కల్పించుకుంటున్నారని వారు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేవాదాయ శాఖ భూములకు రక్షణ కరువై కబ్జా కోరల్లో చిక్కుకు పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై దేవాదాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఆక్రమణకు గురైన భూములకు రక్షణ కల్పించాలని, దేవాలయ భూములలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని కోరారు. దేవాలయ భూముల కబ్జాలకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వినతి పత్రం సమర్పించిన వారిలో సమితి సభ్యులు వేణు, పృథ్వి, నరసింహ ఉన్నారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.