
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై గతంలో తన స్వరం వినిపించిన నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాపై మాజీ రా చీఫ్ ఏఎస్ దౌలత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ రద్దుకు వ్యతిరేకంగా పోరాడినా లోలోపల మాత్రం ఆయన కేంద్రానికి మద్దతుగా ఉండేవారని ఆరోపించారు. ‘ద చీఫ్ మినిస్టర్ అండ్ ద స్పై’ పేరుతో విడుదలైన పుస్తకంలో దౌలత్ ఈ విషయాలు వెల్లడించారు.
‘‘బహిరంగ సభల్లో, మీడియా సమావేశాల్లో ఫరూక్ అబ్దుల్లా.. మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించేవారు. కానీ, లోపల మాత్రం ఆయన కేంద్రానికి మద్దతుగా ఉండేవారు. ఎన్నోసార్లు మోదీ సర్కార్ చర్యలపై సానుకూలంగా స్పందించారు. ఆర్టికల్ 370 రద్దు ప్రతిపాదన వచ్చిన సమయంలో వ్యక్తిగతంగా ఫరూక్ అబ్దుల్లా నాతో మాట్లాడారు. ఈ బిల్లుకు మద్దతు తెలపడంలో తప్పేంటి..? దీనిపై మనమెందుకు విశ్వాసం ఉంచకూడదు..? అని అన్నారు’’ ఈ విషయాన్ని దౌలత్ పుస్తకంలో పేర్కొన్నారు.
‘‘ఈ బిల్లు ఆమోదానికి ముందు ఫరూక్ అబ్దుల్లా ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా (ప్రస్తుత సీఎం) దిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అయితే.. ఈ విషయాన్ని చివరివరకు రహస్యంగా ఉంచారు. అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఆర్టికల్ 370 రద్దు బిల్లు ఆమోదం పొందిన తర్వాత కొన్ని నెలల పాటు అబ్దుల్లా బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. బయటకొచ్చిన తర్వాత తాను ఏం మాట్లాడినా పార్లమెంట్‌లోనేనని అన్నారు’’ అని కీలక విషయాలను ప్రస్తావించారు. దౌలత్ తన పుస్తకంలో వెల్లడించిన అంశాలపై నేషనల్ కాన్ఫరెన్స్ తీవ్రంగా స్పందించింది.





