
కరుడుగట్టిన ఉగ్రవాది అబు బకర్ అల్ బాగ్దాదీ చావును ఐసిస్ నిర్ధారించింది. ఈ మేరకు ఓ ఆడియోను విడుదల చేసింది. దీంతో పాటు తమ సంస్థ తదుపరి అధినేతనూ ప్రకటించింది. బాగ్దాదీ వారసుడిగా ఇబ్రహీం అల్ హషిమి అల్ ఖురేషిను ప్రకటించింది. ఇంతకంటే ఖురేషి గురించి వివరాలేమీ ఇవ్వలేదు. మరోవైపు బాగ్దాదీ అనుచరుడు అబు హసన్ అల్ ముహజిర్ చావును కూడా ఐసిస్ ధృవీకరించింది. 2016 నుంచి అతడు ఐసిస్‌కు ప్రతినిధిగా ఉన్నట్లు తెలిపింది. ఆదివారం అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో అతడు హతమైనట్లు తెలిపింది. బాగ్దాదీ హతమైన కొన్ని గంటల్లోనే అతడి అనుచరుడిని కూడా యూఎస్ సైన్యం మట్టుబెట్టిందని పేర్కొంది. ఈ ఇద్దరి చావుకు కారణమైన యూఎస్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఆ ఆడియోలో తెలిపింది.
ఐసిస్‌ను లక్ష్యంగా చేసుకుని జరిపిన సీక్రెట్ ఆపరేషన్‌లో గత ఆదివారం బాగ్దాదీ హతమైన సంగతి తెలిసిందే. ఎస్‌డీఎఫ్(కుర్దు) దళాల సాయంతో అమెరికా సైన్యం అత్యున్నత స్థాయిలో వ్యూహరచన చేసింది. ఎనిమిది హెలికాప్టర్లను ఉపయోగించి ఆపరేషన్‌ను పూర్తి చేసింది. సిరియాలోని ఇడ్లిబ్ ప్రాంత సమీపంలో జరిగిన ఈ ఆపరేషన్ 90 నిమిషాల్లో ముగిసింది. అమెరికా దళాలతో పోరు మొదలు కాగానే బాగ్దాదీ, అతడి భార్య పేలుడు పదార్థాలను చుట్టుకొని పేల్చేసుకున్నారని టర్కీకి చెందిన ఓ వార్తా ఏజెన్సీ తెలిపింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





