News

శివాజీ ఫొటోను స్టేటస్‌గా పెట్టుకున్న ఇద్దరు యువకులను చితకబాదిన పోలీసు అధికారి

366views

హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫొటోను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నందుకు ఇద్దరు గిరిజన యువకుల్ని పోలీసు అధికారి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. అకోలాలోని బాలాపూర్ తాలూకా లోహారా గ్రామానికి చెందిన ప్రశాంత్ ధేలే, ఆనంద్ ఇంగ్లే అనే యువకులు ఛత్రపతి శివాజీ ఫొటోను తమ స్టేటస్ గా పెట్టుకున్నారు. అంతే.. ఉర్లా పోలీస్ స్టేషన్ కి చెందిన అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ గోపాల్ ధోలే ఆ యువకులను తీవ్రంగా కొట్టారు.

ఈ విషయం గ్రామస్థులకు తెలిసింది. దీంతో గ్రామస్థులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్నారు. శివాజీ ఫొటోను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నందుకు తమ పిల్లల్ని కొట్టారని, ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. శివాజీ మహారాజ్‌కి సంబంధించిన స్టేటస్ చూడగానే.. ఆ పోలీసు అధికారి సహనం కోల్పోయి… ఆ ఇద్దరు విద్యార్థులను పిలిపించి, లాఠీలతో దారుణంగా కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు.

తమ పిల్లలను ఆ పోలీసు అధికారి అత్యంత దారుణంగా కొట్టాడని, ఇది అత్యంత అమానుషమని మండిపడ్డారు. తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతి మితిమీరిన ప్రవర్తన అని అన్నారు.

మరోవైపు గ్రామస్థులతో పాటు సకల్ హిందూ సమాజ్ కూడా ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించింది. ఈ ఘటనను తాము ఖండిస్తున్నామని ప్రతినిధులు తెలిపారు. యువకులనే లక్ష్యంగా చేసుకొని, పోలీసు ప్రవర్తంచడం దారుణమని అన్నారు. ఆ పోలీసు అధికారికి అంత దమ్ము, ధైర్యమే వుంటే.. తన పరిధిలో అక్రమంగా నడుస్తున్న కబేళాలను మూసేయాలని సవాల్ విసిరారు.