ArticlesNews

సనాతన ధర్మం ఒక మతం కాదు జీవనశైలి.

499views

హైందవం ఒక మతం కాదు. అది జీవనశైలి. సనాతన ధర్మమే హైందవానికి ప్రాతిపదిక. సనాతనం అంటే అతి పురాతనం కానీ, నిత్యనవీనం. సత్యం, పరోపకారం, త్యాగం, సేవ, ప్రేమ ఇవన్నీ సనాతన ధర్మ మార్గాలు. ఈశ్వరుడు, వేంకటేశ్వరుడు, రాముడు, కృష్ణుడు… అందరూ వేర్వేరు రూపాల్లో హైందవం కొలుచుకుంటున్న దైవాలు. కానీ ఉన్నది ఒకటే. ‘ఏకం సత్‌ విప్రా బహుధా వదంతి’ అన్నారు ప్రాజ్ఞులు.

మతం అంటే అభిప్రాయం అని అర్థం. మతాలు వేరైనా దైవం ఒక్కటే అని సనాతన ధర్మం చెబుతోంది. మహర్షుల తపఃఫలంగా, వారి దార్శనిక దృక్పథానికి నిదర్శనంగా మానవజాతికి లభించిన వరం సనాతన ధర్మం. సత్యం వద, ధర్మం చర (నిజం మాట్లాడు, ధర్మంగా ఉండు), మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ… ఇటువంటి మేటి మాటల సారాంశమే సనాతన ధర్మం. ఇవన్నీ శాశ్వత సత్యాలు. కాలానుగుణంగా సంప్రదాయాలు ఆచారాలు మారవచ్చు. కానీ ధర్మం మారదు. తల్లిని తండ్రిని గురువును పూజించమని చెప్పే సనాతన ధర్మాన్ని ఏ యుగంలో అయినా ఆచరించాల్సిందే. సత్యం పలకాలి, ప్రియంగా పలకాలి. సత్యమే అయినప్పటికీ కటువుగా చెప్పకూడదు. ప్రియమైనప్పటికి అసత్యాన్ని పలకకూడదు. అదే సనాతన ధర్మం- అని ఒక శ్లోకం చెబుతుంది. రాముడు తాటకిపై బాణం ఎక్కుపెట్టడానికి సందేహిస్తుంటే- రాజ్యభారాన్ని వహించే వాళ్లు చెడును రూపుమాపడంలో భేదభావం చూడకూడదంటాడు విశ్వామిత్రుడు. ఇది ఏ కాలంలో అయినా పాటించాల్సిన కర్తవ్యమే.

మనం ఇతరుల నుంచి పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలి. అలాగే బలహీనులను పీడన నుంచి రక్షించాలి. హక్కులకు భంగం కలుగుతున్నపుడు, అధర్మం హద్దు మీరుతున్నపుడు పోరాడాల్సిందేనంటుంది భారతంలోని ఉద్యోగపర్వం. భారతీయ సంస్కృతికి హైందవ ధర్మానికి మూల స్తంభాలుగా నిలబడిన రామాయణ భారత భాగవతాలు, వాటికన్నా పూర్వమే ఉన్న వేదాలు, వేదాంత సారమైన ఉపనిషత్తులు పలు సందర్భాల్లో అనేక ధర్మసూక్ష్మాలను ప్రబోధించాయి. హైందవ ధర్మాన్ని అనుసరించేవారు ‘ఆత్మ వత్సర్వ భూతాని’ అనుకుంటూ ప్రపంచానికి గొప్ప తేజోమయమైన విలువలు అందివ్వాలి.

సహనం సనాతన ధర్మమార్గం. దాంట్లో విద్వేషానికి తావు లేదు. ఆచారాలు, సంప్రదాయాలు వేరు. అవి కాలానుగుణంగా మారతాయి. బాల్య వివాహాలు, సతీ సహగమనాలు, స్త్రీలను బాధించడం… ఇలాంటివన్నీ దురాచారాలు. సాంఘిక సమస్యలు. ఈ దురాచారాలను సనాతన ధర్మం ఆమోదించదు. ప్రతి యుగంలోనూ కాలానుగుణంగా వచ్చే మార్పులను తట్టుకుంటూ ప్రపంచానికి ఈ సనాతన ధర్మం ఒక నీతిసూత్రంగా, మనుషులంతా పాటించాల్సిన సాంఘిక జీవనధర్మంగా, ఇతరులకు మార్గదర్శకంగా నిలిచింది. మంచిని పెంచాలి. మానవత్వంతో ఉండాలి. ఇదే సనాతన ధర్మం.. ఇదే ఏష ధర్మః సనాతనః