News

రాణా సంగపై వ్యాఖ్యలు చేసిన.. సమాజ్‌వాదీ ఎంపీకి సమాధానం

339views

రాజ్‌పుత్ పాలకుడు రాణా సంగపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్జీలాల్ సుమన్‌పై కర్ణిసేన కార్యకర్తలు కన్నెర్ర చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రాలో ఉన్న రామ్జీలాల్ నివాసంపై దాడి చేశారు. కర్ణిసేన సభ్యులు బుల్డోజర్ తీసుకుని ఆయన నివాసానికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

దీనికిముందు, రాణా సంగాపై ఎంపీ చేసిన వ్యాఖ్యలకు అభ్యంతరం తెలుపుతూ మధ్యప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయం వెలుపల కర్ణిసేన సభ్యులు నిరసనకు దిగారు. ఎంపీ ముఖానికి నలుపురంగు పూసి, చెప్పులతో కొట్టిన వ్యక్తికి రూ.5 లక్షలు రివార్డు ఇస్తామని కూడా కర్ణిసేన రాష్ట్ర విభాగం ప్రకటించింది.

రాణా సంగపై రామ్జీలాల్ సుమన్ వ్యాఖ్యలు
ఈనెల 21న రాజ్యసభలో రామ్జీలాల్ సుమన్ మాట్లాడుతూ, రాజ్‌పుత్ పాలకుడు రాణా సంగను ‘దేశద్రోహి’ అని విమర్శించారు. భారతీయ ముస్లింలు బాబర్‌ను ఆదర్శంగా భావించరని, అసలు ఇబ్రహీం లోడిని ఓడించడానికి బాబర్‌ను భారతదేశానికి ఆహ్వానించనది మేవార్ పాలకుడేనని అన్నారు. అలాంటి రాణా సంగను హిందువులు ఎందుకు విమర్శించరని ప్రశ్నించారు. ముస్లింలను బాబర్ వారసులని పిలిస్తే హిందువులు ‘దోశద్రోహి’ రాణా సంగ వారసులు అయి ఉండాలన్నారు. ఆయన వ్యాఖ్యలపై హిందూ సంస్థలు తీవ్ర నిరసన తెలిపాయి. తమ పార్టీ ఎంపీ వ్యాఖ్యలను ఆ పార్టీ సుప్రీం అఖిలేష్ యాదవ్ సమర్ధిస్తూ, చరిత్రలోని ఒక అంశాన్నే ఎంపీ ప్రస్తావించారని, చరిత్రను తామేమీ రాయలేదని అన్నారు.