News

తిరుమలలో అనధికారికంగా నివసిస్తున్న వారిపై పోలీసులు కొరడా

664views

కూలీల ముసుగులో కొందరు వ్యక్తులు తిరుమలకు మద్యం సీసాలను పెద్దఎత్తున తీసుకొచ్చి వినియోగిస్తున్నారు. తిరుమలలో వివిధ నిర్మాణ పనుల కోసం గుత్తేదారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూలీలను తిరుమలకు తీసుకువచ్చి పనులు చేయించుకుంటారు. నిర్మాణం పూర్తికాగానే వారిని వెనక్కు పంపాల్సి ఉంటుంది. అయితే కొందరు కూలీలు స్థానిక బాలాజీనగర్‌ చివరిలోని పాచికాల్వ గంగమ్మ ఆలయం దారిలో, శ్మశానంలో దారిలో తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసుకుని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. నిషేధిత మద్యం సీసాలను తిరుమలకు తీసుకువచ్చి సేవిస్తున్నారు. దీంతో పాటు తరచూ గొడవలకు పాల్పడుతూ తిరుమల ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తున్నారు. ఇటీవల శ్రీవారి ఆలయ మాడవీధిలో, డీటైప్‌ క్వార్టర్స్‌ వద్ద కార్మికులపై దాడికి పాల్పడి హంగామా సృష్టించారు.

అనధికార వ్యక్తుల తరలింపు ముమ్మరం
తిరుమలలో అసాంఘిక శక్తుల అరాచకాలపై ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు చర్యలు చేపట్టారు. రెండు రోజులుగా తిరుమలలో అనధికార హాకర్లు, కూలీలు, అసాంఘిక శక్తులను గుర్తించి తరలించే పనులు చేపట్టారు. ఇప్పటికే 71 మందిని తిరుమల నుంచి తిరుపతికి తరలించారు. ఆదివారం పాచికాల్వ గంగమ్మ ఆలయం వద్ద కూలీలు తాత్కాలికంగా వేసుకున్న షెడ్లను తితిదే విజిలెన్స్, పోలీసు అధికారులు తొలగించారు. ప్రతి ఒక్కరి గుర్తింపును తనిఖీ చేశారు. కూలీల్లో ఎవరైనా పాతనేరస్థులు ఉన్నారా అనే విషయాన్ని టాపిలాన్‌ పరికరం ద్వారా పరిశీలించారు. అనంతరం అక్కడున్న గృహాలను ఖాళీ చేసి వాహనాల్లో తరలించారు.

పటిష్ట నిఘాతోనే నియంత్రణ
తిరుమలకు మత్తుపదార్థాలు, మద్యం అక్రమ రవాణా కాకుండా పోలీసు, తితిదే విజిలెన్స్, ఎక్సైజ్‌శాఖ పటిష్ట నిఘా పెడితేనే నియంత్రించేందుకు వీలవుతుంది. మూడు విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ తిరుమలకు మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలి. ఈ మేరకు ఉన్నతాధికారులు చొరవతీసుకుని చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.