
నల్లమల ప్రాంతం.. మల్లన్న క్షేత్రం.. అతిపెద్ద గోశాల.. నిత్యం లభించే గోమయాన్ని(పేడ) వ్యర్థం చేయకుండా కొత్త అర్థం చెబుతున్నారు అక్కడి సిబ్బంది. శ్రీశైలం దేవస్థానం గోసంరక్షణశాలలోని 1,000 గోవుల ద్వారా వచ్చే పేడ నుంచి వివిధ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు.. వాటికి ఎంతో ఆదరణ ఉంటోంది.. ఇల కైలాసంలో తయారయ్యే భస్మాన్ని (విభూది)ని ధరించడం కన్నడిగులు పరమ పావనంగా భావిస్తుంటారు. శ్రీశైలంలో కొలువైన భ్రమరాంబను ఇంటి ఆడపడుచుగా భావించే కన్నడీగులు ఉగాదికి చీర, సారె సమర్పిస్తారు.. వంద కి.మీ. నడుచుకుంటూ ఇలకైలాసం చేరుకొంటారు.. క్షేత్రంలో పవిత్రంగా తయారు చేసిన భస్మాన్ని శివ భక్తులు మూడు నామాలుగా ధరించి అమితానందం పొందుతారు.

గోఆర్క్: గోశాలలోని గోవుల నుంచి తెల్లవారుజామున (బ్రహ్మ ముహూర్తంలో) మూత్రాన్ని సేకరిస్తారు. ఆ మూత్రాన్ని గుడ్డ ద్వారా 14 పొరలుగా వడ కడతారు. గోమూత్రాన్ని బాయిలర్ ద్వారా వేడి చేసి ఆవిరి నుంచి గోఆర్క్ తయారు చేస్తారు. ఈ గోఆర్క్ తయారు చేసే ప్రక్రియలోనే జీలకర్ర, నేల ఉసిరి, నేల వేము, తిప్పతీగ, పుదీనా, అల్లంతో పాటు పలు రకాల మూలికలు మిళితం చేస్తారు. ఈ గోఆర్క్ సర్వరోగ నివారిణిగా పని చేస్తుందని పండితులు చెబుతున్నారు. అందుకే గోఆర్క్ సీసాల కొనుగోలుకు భక్తులు ఎంతో మక్కువ చూపుతారు. కొవిడ్ వంటి సమయంలో గోఆర్క్ తాగిన వారికి ప్రయోజనం కలిగిందని చెబుతారు.

దంతమంజన్: ఆవు పేడను ఎండబెట్టి పిడకలుగా చేస్తారు. వాటిని బట్టి ద్వారా కాల్చి పౌడర్‌గా తయారు చేస్తారు. ఆ పౌడర్‌లో వాము పువ్వు, పుదీనా, పచ్చ కర్పూరం, లవంగ పొడి, ఉత్తరేణి, త్రిఫల చూర్ణాలను కలిపి దంతమంజన్ తయారు చేసి ప్యాకెట్ల ద్వారా విక్రయిస్తున్నారు.
ధూప్‌స్టిక్: ఆవు పేడను సేకరించిన తర్వాత శుద్ధి చేసి కొన్ని రకాల వనమూలికలు కలిపి ధూప్‌స్టిక్ తయారు చేస్తున్నారు. ప్రత్యేక డబ్బాల్లో వేసి వాటిని విక్రయిస్తున్నారు.

విభూది: దీన్ని ఐశ్వర్యం, భస్మం, భస్మితం వంటి పేర్లతో పిలుస్తారు. దీన్ని ధరించకుండా శివ దర్శనం, శివ పూజ చేయరాదని దేవీ భాగవతం, శివ పురాణం చెబుతున్నాయి. ఎంతో ప్రాధాన్యం ఉన్న విభూది తయారీలో మొదట..గోవుల పేడను సేకరించి ఆరబెట్టి కాలుస్తారు. వచ్చిన పొడిని నీటితొట్టెలో నానబెట్టగా వచ్చిన పదార్థాన్ని వడకట్టి తర్వాత జల్లెడ పట్టగా స్వచ్ఛమైన విభూది వస్తుంది. ఆలయంలో నిర్వహించిన రుద్ర, చండీ, మృత్యుంజయ, గణపతి హోమాల ద్వారా వచ్చిన భస్మాన్ని, పచ్చ కర్పూరాన్ని విభూదిలో కలుపుతారు. వేద మంత్రాలతో నిర్వహించిన హోమభస్మాన్నీ విభూదిలో కలపడంతో పవిత్రంగా మారుతుంది. వారానికి సుమారు 500 కిలోల విభూదిని దేవస్థానం సిబ్బంది తయారు చేస్తున్నారు. ప్రత్యేక డబ్బాల్లో పరిమాణాల ప్రకారం భక్తులకు విక్రయిస్తున్నారు.





