News

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్

558views

శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి వార్లను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు మరియు ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం మోహన్ భాగవత్ మల్లిఖార్జున స్వామి కి అభిషేకం, భ్రమరాంబికా దేవికి కుంకుమార్చన నిర్వహించారు. ఆ తరువాత అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆయనను వేద పండితులు ఆశీర్వదించి సన్మానించారు.

అనంతరం శ్రీ మోహన్ భాగవత్, ఈవో కె.ఎస్.రామారావులు నక్షత్ర వనంలో మర్రి, తెల్ల మద్ది, కదంబం, మేడి, రావి, జమ్మి మొక్కలను నాటారు. ముందుగా నక్షత్రవనంలో వీరితో అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు చేయించారు. అలాగే శివాజీ స్ఫూర్తి కేంద్రంలో జరిగిన మహాశక్తి యాగంలో కూడా శ్రీ భాగవత్ పాల్గొన్నారు. స్థానిక శ్రీదేవి వేద విద్యాలయాన్ని సందర్శించి ఆ విద్యాలయ కమిటీతో సమావేశమయ్యారు. ఆయన వెంట ఆర్ ఎస్ ఎస్ క్షేత్ర ప్రచారక్ శ్రీ శ్యాం కుమార్, ఆంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ ల తోపాటు శివాజీ స్ఫూర్తి కేంద్రం సభ్యులు మరియు స్థానిక ఆర్ ఎస్ ఎస్ బిజెపి కార్యకర్తలు ఆయా కార్యక్రమాలలో పాల్గొన్నారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.