
దిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పరమార్థ నికేతన్ ఆశ్రమ గురువు.. ఆధ్యాత్మికవేత్త అయిన చిదానంద సరస్వతి పాల్గొన్నారు. ఇందులోభాగంగా ఆయన మాట్లాడుతూ కుంభమేళా సమయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారు. తన వద్దకు ఓ యువకుడు వచ్చి తాను ఆధ్యాత్మికత వైపు దృష్టిసారించాలంటే.. ప్రస్తుతం తాను వేసుకుంటున్న జీన్స్‌ను వదిలేసి.. సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాల్సి ఉంటుందా అని ప్రశ్నించాడని తెలిపారు.
అయితే యువత ఎటువంటి దుస్తులు ధరిస్తున్నారని కాదు.. ఎటువంటి విలువలు పాటిస్తున్నారనేదే ముఖ్యమని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. కుంభమేళాకు చాలామంది జీన్స్ ధరించి వచ్చారని, దాంతో ఎలాంటి ఇబ్బంది లేదని వివరించారు. అయితే వచ్చినవారు వారి జీన్స్(మూలాలను), సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను మరిచిపోతేనే ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని అన్నారు.
మస్క్ కుంభమేళాలో పాల్గొనాలనుకున్నారు
ఈ కార్యక్రమంలో నిరంజని అఖాడా అధిపతి స్వామి కైలాసానంద గిరి మాట్లాడుతూ.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కుంభమేళాకు రావాలని అనుకున్నారని తెలిపారు. ఈమేరకు ఆయన సందేశాన్ని స్టీవ్ జాబ్స్ సతీమణి తమకు చేరవేశారని అన్నారు. కుంభమేళాలో ఏర్పాటుచేసిన తమ శిబిరంలో బస చేయడానికి మస్క్ ఆసక్తి చూపినట్లు పేర్కొన్నారు. కుంభమేళా నిర్వహణ గురించి మాట్లాడుతూ.. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఉండడం వల్లే ఇది సాధ్యమైందని కైలాసానంద అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల నిర్వహించిన కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి విదేశీయులు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు.





