
అమాయక యువతను హింసాయుత మార్గం వైపు మళ్ళించే ప్రయత్నాలు మానుకోవాలని హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ మావోయిస్టు అనుబంధ సంఘాలను హెచ్చరించారు.
తెలంగాణ విద్యార్థి వేదిక (TVV) ను సిపిఐ (మావోయిస్టు) అనుబంధ సంస్థగా ధ్రువీకరించిన కమీషనర్ శ్రీ కుమార్ మాట్లాడుతూ, అనేకమంది కుహనా మేధావులు ఇటువంటి సంస్థలలో ఉన్నారని, వారు ఏనాటికైనా చట్టం ముందు దోషులుగా నిలవక తప్పదని అన్నారు.
“TVV వంటి ఫ్రంటల్ సంస్థలు మావోయిస్టు గ్రూపులతో సుదీర్ఘ అనుబంధాన్నికలిగి ఉన్నాయని ఆయన అన్నారు.
టివివి అధ్యక్షుడు మద్దిలేటి నివాసంలోనూ, ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ జగన్ తదితరుల నివాసాల్లోనూ ఇటీవల తెలంగాణ పోలీసులు నిర్వహించిన శోధనలను ప్రస్తావిస్తూ, ఈ సంస్థకు మావోయిస్టులతో ఉన్న సంబంధాలను నిర్ధారించే అనేక సాక్ష్యాధారాలు లభించినట్లుగా ఆయన తెలిపారు.
నేషేదిత మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో జగన్ ను జోగుళాంబ-గద్వాల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జగన్, మద్దిలేటిలతో సహా మరికొందరు TVV సభ్యులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) మరియు సెక్షన్ 120-B (కుట్ర), తిరుగుబాటు అభియోగాలను నమోదు చేశారు.
నిందితులు నిషేధిత మావోయిస్టు పార్టీకి ఆధారభూతమైన వ్యక్తులని, కొత్త కేడర్ ను రిక్రూట్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారని పోలీసులు తెలిపారు. జగన్ ను అరెస్టు చేసిన దాదాపు వారం రోజుల తర్వాత వనపర్తికి చెందిన పి. నాగన్న అలియాస్ నాగరాజు, హైదరాబాద్ కు చెందిన బలరాం అనే ఇద్దరు టివివి సభ్యులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు.
నిందితులు, సిపిఐ (మావోయిస్టు) తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ సహా మావోయిస్టు అగ్ర నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసు శాఖలోని వర్గాలు ది హిందూ కి తెలిపాయి.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





