News

కుంభమేళాకు 20 రోజుల్లోనే 33కోట్ల మంది.. వసంత పంచమి వేళ మరింత రద్దీ

267views

మహాకుంభమేళా నేపథ్యంలో వసంత పంచమి నాడు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. మౌని అమావాస్య రోజున చోటుచేసుకున్న తొక్కిసలాటతో అప్రమత్తమైన యూపీ సర్కార్‌.. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఎటువంటి తప్పిదం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించి ప్రభుత్వం.. సీనియర్‌ ఐఏఎస్‌లను రంగంలోకి దింపింది.

జనవరి 13న కుంభమేళా ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 1వ తేదీ వరకు ప్రయాగ్‌రాజ్‌లో సుమారు 33కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. శనివారం 2.15కోట్ల మంది రాగా.. ఆదివారం మధ్యాహ్నం 12గంటల వరకే 90లక్షల మంది భక్తులు స్నానాలు ఆచరించినట్లు తెలిపింది. వసంత పంచమి పురస్కరించుకొని సోమవారం 4 నుంచి 6కోట్ల మంది రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కుంభమేళాకు ప్రముఖుల తాకిడి కూడా పెరుగుతోంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌కు వచ్చివెళ్లగా.. ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ రాక కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

మౌని అమావాస్య రోజున కోట్లాది మంది ప్రయాగ్‌రాజ్‌ రావడం, సెక్టార్‌ 2లో జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోయిన నేపథ్యంలో క్రౌడ్‌ మేనేజిమెంట్‌పై అధికారులు మరింత దృష్టి సారించారు. 2019లో అర్ధ కుంభమేళా సమయంలో పనిచేసిన ఐఏఎస్‌ అధికారులు అశీష్‌ గోయల్‌, భానుచంద్ర గోస్వామిలను రంగంలోకి దించారు. వీరిద్దరు మేళా అధికారి విజయ్‌ కిరణ్‌ ఆనంద్‌తో కలిసి పని చేయనున్నారు.

అదనపు డీజీపీ భాను భాస్కర్‌ కూడా రద్దీ నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం ఘాట్‌లను పరిశీలించిన ఆయన.. స్నానాల తర్వాత ఘాట్‌ల వద్ద కాలక్షేపం చేయవద్దని సూచించారు. ఇతరుల కోసం ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని, ఘాట్‌ల వద్ద భోజనాలు చేయవద్దని చెబుతున్నారు. విశ్రాంతి కోసం భక్తులు నిర్దేశించిన ప్రాంతాలకు వెళ్లాలని మైక్‌లలో ప్రకటనలు చేశారు.

ఇదిలాఉంటే, కుంభమేళా సమయంలో సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమిలను పవిత్ర రోజులుగా భావిస్తారు. వీటితోపాటు మాఘ పూర్ణిమ (ఫిబ్రవరి 12), మహా శివరాత్రి (ఫిబ్రవరి 26) రోజుల్లోనూ అమృత స్నానం ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే అవకాశం ఉంది.