
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. భారతీయ మూలాలను, సంప్రదాయాలను, విలువలనూ పాటించే వ్యక్తులు తరచూ తారసపడుతుంటారు. అది ఎంత పెద్ద పదవిలో ఉన్నా కూడా!. అలాంటి వాళ్లలో ట్రంప్ వీరవిధేయుడు, ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవికి నామినీ అయిన కశ్యప్ పటేల్ ఒకరు. తాజాగా ఆయన చేసిన చర్య ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
44 ఏళ్ల కశ్యప్ క్యాష్ పటేల్.. తాజాగా(గురువారం) సెనేట్ జ్యూడీషియరీ కమిటీ ఎదుట హాజరయ్యారు. ఈ క్రమంలో తనకు మద్ధతు తెలపడానికి సుదూరాల నుంచి వచ్చిన తల్లి అంజనా, తండ్రి, సోదరిని కమిటీకి ఆయన పరిచయం చేశారు. చివర్లో ‘జై శ్రీ కృష్ణ’ అంటూ ముగించారు. అంతకు ముందు.. కమిటీ విచారణ ప్రారంభానికి ముందు ఆయన తన తల్లిదండ్రుల పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
విచారణ ఎందుకంటే..
ఎఫ్‌బీఐ డైరెక్టర్ నామినీ అయిన కశ్యప్ పటేల్‌ను సెనేట్ జ్యూడీషియరీ కమిటీ విచారణ జరుపుతుంది. సాధారణంగా ఈ కమిటీ ఆ పదవికి నామినీకి ఉన్న అర్హతలను సమీక్షించడంతో పాటు గతంలో చేసిన వ్యాఖ్యలను, వివాదాస్పద చర్యలను పరిశీలిస్తుంది. చివరకు సదరు నామినేషన్‌ను అంగీకరించాలా? తిరస్కరించాలా? అనేది ఈ కమిటీ చేతుల్లోనే ఉంటుంది.
ఇక విచారణలో భాగంగా గతంలో.. జర్నలిస్టులను ప్రాసిక్యూషన్ చేయాలని, ఎఫ్‌బీఐ ప్రధాన కార్యాలయాన్ని కూల్చేయాలని కశ్యప్ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నలు గుప్పించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ట్రంప్‌ను ఆయనకు ఉన్న అనుబంధంపైనా ప్రశ్నలు గుప్పించినట్లు సమాచారం. వీటితో పాటు జాత్యహంకారానికి గురయ్యారా?అనే ప్రశ్నకు.. ఆయన అవుననే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
‘‘గతంలో నేనూ గతంలో జాత్యహంకారానికి గురయ్యాను. అమెరికాలో ఎలాంటి హక్కు లేని ఓ వ్యక్తిగా నన్ను పేర్కొనేవారు. మీరు ఎక్కడినుంచి వచ్చారో అక్కడికే తిరిగి వెళ్లిపోవాలంటూ నాకు మెసేజ్‌లు వచ్చేవి. చట్టాన్ని కాపాడుతున్న ఎంతోమంది వ్యక్తులు ఎదుర్కొంటున్న దానితో పోలిస్తే నాకు జరిగింది చాలా చిన్నదిగా అనిపించింది. నా కుటుంబసభ్యులు ఇక్కడ ఉండగా.. ఆ సంఘటనను గురించి పూర్తిగా వెల్లడించలేను’’ అని పటేల్ అన్నారు.
కాష్ పటేల్ గురించి..
ట్రంప్‌కు వీరవిధేయుడిగా కాష్ పటేల్‌కు పేరుంది. గుజరాత్‌లో ఈయన కుటుంబమూలాలు ఉన్నాయి. ఈయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. అయితే ఉగాండలో నియంత ఈదీ ఆమిన్ బెదిరింపుల కారణంగా కాష్ తండ్రి అమెరికాకు వలస వచ్చారు. న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీ 1980లో కశ్యప్ పుట్టాడు. ప్రస్తుతం ఆయన కొలంబియాలో ఉంటున్నారు.
కాష్ పటేల్ పూర్తి పేరు.. కశ్యప్ ప్రమోష్ వినోద్ పటేల్. యూనివర్శిటీ ఆఫ్ రిచ్‌మాండ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. యూనివర్శిటీ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఓ లా సంస్థలో పని చేయాలనుకున్నా.. కొలువు లభించలేదు. దీంతో అతడు మియామీ కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్‌గా పనిచేశారు. ఆ తర్వాత జస్టిస్ డిపార్ట్‌మెంట్‌లో చేరారు.
కాష్ పటేల్‌ను ప్రతినిధుల సభలోని కమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేసేందుకు నియమించారు. దీంతో ఆయన 2016 ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తులో సాయం చేశారు. రక్షణ విషయంలో ట్రంప్ ప్రాధాన్యాలు కశ్యప్‌కు బాగా తెలుసు. ఐసిస్ నాయకుడు అల్ బాగ్దాదీ, అల్-ఖైదా హెడ్ అల్ రిమి వంటి ఆపరేషన్లకు సంబంధించి పనిచేశారు.
అంతేకాదు పలుచోట్ల బందీలుగా ఉన్న అమెరికన్లను సురక్షితంగా దేశానికి రప్పించడంలో ఈయన పాత్ర ఉంది. జస్టిస్ డిపార్ట్‌మెంట్‌లో స్పెషల్ ఆపరేషన్ కమాండ్‌లో లైజనింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు కూడా. ట్రంప్ రహస్య పత్రాల వ్యవహారం విచారణ సమయంలోనూ ఈయన పేరు ప్రముఖంగానే వినిపించింది. అయితే..
ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచాక.. సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీకి కొత్త చీఫ్ ఎవరవుతారనే చర్చ నడిచింది. ఆ సమయంలో రేసులో కాష్ పటేల్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే అమెరికా మాజీ గూఢచారి జాన్ రాట్‌క్లిఫ్ ఆ అవకాశం దక్కించుకున్నారు. చివరకు ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవికి ఆయన పేరును ట్రంప్ నామినేట్ చేశారు. సెనేట్ కమిటీ గనుక ఆయన పేరుకు క్లియరెన్స్ ఇస్తే.. దాదాపుగా ఆయనకు అగ్రరాజ్య దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ పగ్గాలు దక్కే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే.. భారతీయ మూలాలు ఉన్న కాష్ పటేల్ చరిత్ర సృష్టించినట్లే!.





