
ముంబై ఐఐటీలో ఏరోస్పేస్‌లో ఇంజనీరింగ్ చదువు.. కెనడాలో ఉద్యోగం.. ఏడాదికి 36 లక్షల ప్యాకేజీ.. మన జీవితానికి ఏకేం కావాలి? ఏంచక్కా ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా బతికేద్దాం అని అనుకుంటారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం అవన్నీ వదిలేసి ఆధ్యాత్మికత వైపు మళ్లాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు అలా మారాడు? అనే విషయాలను తెలుసుకుందాం..
ఐఐటీయన్ బాబా..
ఐఐటీయన్ బాబా.. అలియాస్ అభయ్ సింగ్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ బాబా మహాకుంభమేళలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఆధ్యాత్మిక మార్గమే తన గమ్యస్థానంగా భావించి బాబాగా అవతరించాడు. ఆధునిక జీవితానికి దూరంగా ఉండి, ఆధ్యాత్మిక జీవితం వైపు అడుగులేయడమే అభయ్ అందరినీ ఆకర్షించేందుకు ప్రధాన కారణం.
కెనడాలో 36 లక్షల ప్యాకేజీ..
హర్యానాకు చెందిన ఈ ఐఐటీయన్ బాబా అసలు పేరు అభయ్ సింగ్. తండ్రి న్యాయవాది. ముంబైలో ఐఐటీ బాంబేలో నాలుగేళ్ల పాటు ఎయిర్ స్పేస్ అండ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే జీవితానికి అర్థం వెతికే క్రమంలో కొన్ని ఫిలాసఫీ కోర్సులు చదివారు. అనంతరం ఆర్ట్స్‌పై ఆసక్తితో డిజైనింగ్‌లో మాస్టర్స్ కూడా పూర్తి చేశారు. బాంబేలో నాలుగేళ్ల పాటు ఉన్న అభయ్.. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో కెనడాలోని ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఏడాదికి 36 లక్షల ప్యాకేజీతో ఉద్యోగంలో చేరాడు.
#WATCH | Prayagraj, UP: #MahaKumbh2025 | Baba Abhay Singh who is from Juna Akhada and was also an IIT student once, says, " I come from Haryana, I went to IIT, then changed to Arts from Engineering, that also didn't work so I kept changing and later I arrived at the final truth.… pic.twitter.com/Li6EwgCXbU
— ANI (@ANI) January 15, 2025
ఆధ్యాత్మికత వైపు అడుగులు..
అభయ్‌కు ఆ జాబ్ కూడా మనశ్శాంతి ఇవ్వలేకపోయింది. గొప్ప గొప్ప చదువుల్లో విజయం సాధించినా.. ఎన్నో ఉద్యోగాలు చేసినా జీవితంలో మాత్రం అభయ్ కు సంతృప్తి దొరకలేదు. ఇక ఉద్యోగం, కుటుంబసభ్యులందరినీ వదిలేసి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేశారు. ఆధ్యాత్మికతను మరింత లోతుగా అర్థం చేసుకుని సన్యాసిగా అవతరించాడు. తన కొడుకు సన్యాసిగా మారాడని తెలుసుకున్న అభయ్ తండ్రి తనను ఇంటికి తిరిగి రమ్మని ఎన్నోసార్లు పిలిచారు. అయితే, అభయ్ మాత్రం తన ఆధ్యాత్మికత జీవితం ఎంతో సంతోషంగా ఉందని, తిరిగి ఇంటికి వచ్చే ఉద్దేశ్యం తనకు లేదని చెప్పారు.
భక్తులను ఆకట్టుకుంటున్న బాబా..
మహాకుంభమేళంలో ఇంగ్లీష్‌పై తనకున్న పట్టుతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. శాస్త్రీయ విజ్ఞానం, ఆధ్యాత్మికతను గురించి మాట్లాడుతూ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఐఐటీ స్టూడెంట్ బాబాగా మారిపోవడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో బాబా వీడియోలు వైరల్ అవ్వడంతో కుంభమేళాలోని భక్తులంతా బాబా దగ్గర ఫోటోలు దిగడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఐఐటీయన్ బాబా విపరీతంగా వైరల్ అవుతున్నాడు. అభయ్ సింగ్ లైఫ్ జర్నీ ఎంతో మందిని ఆకట్టుకుంటుంది.





