News

శ్రీగిరి వాసా.. భక్త మది నివాసా

244views

శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు మంగళవారం ఆలయ ప్రాంగణంలో పార్వతి, మల్లికార్జున స్వామివార్ల బ్రహ్మోత్సవ కల్యాణం కనులపండువగా జరిగింది. ముందుగా రాత్రి 7 గంటలకు ఆలయ ప్రాంగణంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను నందివాహనంపై కొలువుదీర్చారు. ఉభయ దేవాలయాల అర్చకులు, వేదపండితులు ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. కళాకారుల సందడి నడుమ స్వామి, అమ్మవార్ల గ్రామోత్సవం శ్రీగిరి పురవీధుల్లో శోభాయమానంగా జరిగింది. అనంతరం ఆలయ నిత్య కల్యాణ మండపంలో పార్వతీదేవి సమేత మల్లికార్జునస్వామికి బ్రహ్మోత్సవ కల్యాణం వైభవంగా జరిగింది. స్థానాచార్యులు ఎం.పూర్ణానందస్వామి, ఉభయ దేవాలయాల అర్చకులు ఆది దంపతులైన స్వామి, అమ్మవార్లకు శాస్త్రోక్తంగాబ్రహ్మోత్సవ కల్యాణం జరిపించారు.

స్థానిక చెంచు గిరిజనులు ఐటీడీఏ పీవో శివప్రసాద్‌ ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు నూతన వస్త్రాలతో పాటు అటవీ ఉత్పత్తులతో తయారు చేసిన ఆభరణాలు సమర్పించారు. స్వామి, అమ్మవార్లకు ఈతాకులతో అల్లిన కంకణాలు, బాలికాలు, స్వామివారికి యజ్ఞోపవీతం, అమ్మవారికి వడ్డాణం, మెట్టెలు, మెడలో అలంకరించే ఆకులతో అల్లిన ఆభరణాలు కానుకలుగా సమర్పించారు. ఈసందర్భంగా దేవస్థానం తరపున ఈవో ఎం.శ్రీనివాసరావు స్థానిక చెంచులకు నూతన దుస్తులు పంపిణీ చేశారు.

రావణ వాహనంపై శ్రీశైలేశ్వరుడు
శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు బుధవారం పార్వతీ సమేత మల్లికార్జునస్వామి భక్తులకు రావణ వాహనంపై దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు, వేదపండితులు మంగళ హారతులతో, పుష్పార్చనలతో పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు, జానపద కళాకారుల సందడి నడుమ స్వామి, అమ్మవార్లను గ్రామోత్సవానికి తీసుకొచ్చారు. గంగాధర మండపం నుంచి నంది మండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం కనులపండువగా జరిగింది.

శ్రీశైలంలో నేడు.. : శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల ఆరోరోజు గురువారం ఉదయం యాగశాలలో పూర్ణాహుతి, అవభృదం, కలశోద్వాసన, వసంతోత్సవం, విశేషార్చనలు నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు సదస్యం, నాగవల్లి, రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ కార్యక్రమం ఉంటాయి.