
సరిహద్దు సమస్యల గురించి భారత్-చైనా ఎన్ని దఫాలు చర్చలు జరిపినా నిష్ప్రయోజనమని, ఎలాంటి సత్ఫలితాలు రావని ‘అఖండ టిబెట్’ను రెండు దేశాలు గుర్తిస్తేనే మొత్తం సమస్యలకి పరిష్కారం లభిస్తుందని ధర్మశాల కేంద్రంగా పని చేస్తున్న టిబెట్ ప్రవాస ప్రభుత్వం అభిప్రాయ పడింది. ఈ అంశాన్ని ప్రభుత్వ అధికార ప్రతినిధి దోల్మా గ్యారీ డిసెంబర్ 10వ తేదీన వెల్లడించారు. “చైనాతో శాశ్వతంగా శాంతి కొనసాగాలంటే ఒక్కటే మార్గమని అదే ఐక్య టిబెట్ గుర్తించడమేనని ఆమె అన్నారు.
గ్వారా రక్షణ మంత్రి బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. 1914లో బ్రిటిష్ ఇండియాతో టిబెట్ ఒప్పందం చేసుకుందని, దాని టిబెట్ సంతకం చేసిందని, దాని ప్రకారం అరుణాచలప్రదేశ్ భారత్ లో అంతర్భాగంగా అంగీకరించిందని గ్యారా తెలియ చేశారు. సరిహద్దు సమస్య శాశ్వత పరిష్కారాన్ని దృష్టిలో ఉంచుకుని చైనా కూడా అఖండ టిబెట్ స్వాతంత్ర్యాన్ని గుర్తించాలని ఆమె కోరారు. ఇటీవల టిబెట్ కార్యనిర్వాహక అధ్యక్షురాలు కూడా ఈ విషయం మీడియా ఎదుట ప్రస్తావించారు. భారత్, చైనా దేశాల మధ్య జరిగే అన్ని చర్చలలోను కేంద్ర బిందువు టిబెట్ అంశమేనని పేర్కొనడం గమనార్హం.
దలైలామాకు నోబెల్ శాంతి పురస్కారం వచ్చి 35 సంవత్సరాలు అయిన సందర్భంగా ఫిజీ, న్యూజి లాండ్ ఎంపీల బృందం ధర్మశాల వచ్చినప్పుడు ఈ విషయాలు చర్చకు వచ్చాయి. వీరి కార్యక్రమా నికి కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమన్న అంశం తిరుగులేనిదని టిబెట్ కేంద్ర అధికార యంత్రాంగం స్పష్టంగా ప్రకటిస్తూ ఉంటుంది. కాగా, వచ్చే సంవత్సరం దలైలామా 90వ జన్మదినం. ఈ సందర్భంగా ప్రపంచ దయా దినోత్సవం నిర్వహించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.





