
దివంగత కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కుటుంబం దాతృత్వం చూపింది. పింఛను తీసుకోవడానికి నిరాకరించింది. తమ కుటుంబానికి ఇచ్చే పింఛను డబ్బులను రాజ్యసభలోని నాలుగో తరగతి సిబ్బందికి ఇవ్వాల్సిందిగా జైట్లీ భార్య సంగీతా జైట్లీ సోమవారం రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ రాశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధిపడిన జైట్లీ ఆగస్టు 24న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన ఎంపీగా ఉన్న సమయంలో రాజ్యసభలో ఉన్న సిబ్బంది సమస్యలను కళ్లారా చూశారని లేఖలో సంగీతా పేర్కొన్నారు.
పార్లమెంట్ సభ్యుల చట్టం ప్రకారం.. మాజీ ఎంపీలకు రూ.20 వేలు కనీస పింఛనుగా ఇవ్వాలి. వీటితో పాటు మరో రూ.1500 అదనపు భత్యం కింద ఇస్తారు. అరుణ్ జైట్లీ 1999 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇందుకు గానూ ఆయనకు నెలకు అదనంగా మరో రూ.22,500 పింఛనుగా వస్తోంది. మొత్తంగా ఆయనకు దాదాపుగా రూ.50వేలు పింఛను రూపేణా ఇస్తున్నారు.
అయితే మాజీ ఎంపీలకిచ్చే పింఛనులో సగం మొత్తాన్ని కుటుంసభ్యుల్లో భార్య/భర్తకు లేదా వారి మీద ఆధారపడిన వారికి ఇస్తారు. ఈ రకంగా జైట్లీ కుటుంబానికి నెలకు రూ. 25వేలు చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని జైట్లీ కుటుంబం రాజ్యసభలోని చిరుద్యోగులకిమ్మని రాజ్యసభ చైర్మన్ శ్రీ వెంకయ్య నాయుడును కోరింది.





