
రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలో లేదో తమకు చెప్పే అధికారం ఏ దేశానికి లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలో నిర్ణయించుకునే హక్కు తమకు ఉందని.. ఇతరులు దీన్ని గుర్తించి వ్యవహరిస్తే ఎవరి ప్రయోజనాలకు భంగం కలగదని వ్యాఖ్యానించారు. ఆయుధాల సమకూర్చుకోవడం, కొనుగోళ్లు పూర్తిగా దేశ సార్వభౌమ అధికారం అని స్పష్టం చేశారు. రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థ కొనుగోలు విషయంలో అమెరికా అభ్యంతరాలపై చర్చిస్తున్నామన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఉన్న ఆయన సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో భేటీ కానున్న కొన్ని గంటల ముందు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అత్యాధునిక గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థ అయిన ఎస్-400ను రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు గత అక్టోబర్‌లో భారత్ ఒప్పందం కుదుర్చుకొంది. అయితే దీనిపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఉక్రెయిన్, సిరియాలో సైనిక జోక్యం చేసుకుంటున్న రష్యా నుంచి భారీ ఆయుధ కొనుగోళ్లు చేపట్టొద్దని అమెరికా ఆంక్షలు విధించింది. దీన్ని అతిక్రమించిన టర్కీపై ఇప్పటికే అగ్రరాజ్యం కన్నెర్రజేసింది. అయితే భౌగోళికంగా పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో ఎస్-400 ఆయుధ కొనుగోలు తప్పదని భారత్ ఇప్పటికే అమెరికాతో స్పష్టం చేసింది.





