
శ్రీశైల మహాక్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని శ్రీశైల దేవస్థానం ఈఓ ఎం. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 తేదీ వరకు శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. కాలిబాట మార్గంలోని దామెర్లకుంట, పెద్దచెరువు ప్రాంతాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై ఈఓ సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఆయా ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాన రహదారిలోని ఆత్మకూరు వెంకటాపురం నుంచి భక్తులు అటవీ మార్గంలో గోసాయికట్ట వీరాంజనేయస్వామి, నాగలూటి, దామెర్లకుంట, పెద్దచెరువు, మఠంబావి, భీముని కొలను, కై లాస ద్వారం మీదుగా శ్రీశైలక్షేత్రాన్ని చేరుకుంటారన్నారు. ఈ కాలిబాట మార్గంలో మంచినీటి సదుపాయం, భక్తులు సేదతీరేందుకు చలువ పందిర్లు , తాత్కాలిక విద్యుద్దీకరణ, అన్నదానం చేసే భక్త బృందాలకు దేవస్థానం అందించాల్సిన సహాయ సహకారాలపై సూచనలు చేశారు. అటవీశాఖ సహకారంతో దామెర్లకుంట – పెద్దచెరువు ప్రాంతాల్లో జంగిల్ క్లియరెన్న్స్ పనులను వెంటనే చేపట్టాలన్నారు. దామెర్లకుంట – పెద్దచెరువు వద్ద గత సంవత్సరం కంటే కూడా అదనంగా చలువపందిళ్లు వేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేకంగా పైప్ పెండాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. గత సంవత్సరం కంటే కూడా 20 శాతం మేరకు అధిక ఏర్పాట్లు ఉండాలన్నారు. నడుచుకుంటు వచ్చే భక్తులు కాలిబొబ్బలు, ఒళ్లునొప్పులతో బాధపడుతుంటారని వారికి పూతమందులు అందుబాటులో ఉంచాలని దేవస్థాన వైద్య విభాగాన్ని ఆదేశించారు.





