
కొత్త సంవత్సరం వేళ అయోధ్య నగరం పర్యటకులతో కళకళలాడనుంది. నూతన ఏడాదిలోకి అడుగుపెట్టడం, అలాగే బాలరాముడు కొలువుదీరి సంవత్సరం పూర్తి కావొస్తుండటంతో భారీగా భక్తులు తరలిరానున్నారు. దాంతో ఎలాంటి నిర్వహణ లోపాలు తలెత్తకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే దర్శన వేళలు పెంచుతూ రామ జన్మభూమి తీర్థక్షేత్రట్రస్ట్ నిర్ణయం తీసుకుంది.
‘‘భక్తులకు స్వాగతం పలికేందుకు అంతా సిద్ధంగా ఉంది. జనవరి 15 వరకు హోటల్ గదులన్నీ ముందుగానే బుక్ అయ్యాయి’’ అని స్థానిక హోటల్ యజమాని అంకిత్ మిశ్రా వెల్లడించారు. చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే గదుల లభ్యత ఉందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇదే అదనుగా కొందరు హోటళ్ల యజమానులు ఒక్కరోజుకు రూ.10వేల వరకు వసూలు చేస్తున్నట్లు వెల్లడించాయి. ‘‘రాముడి ఆలయం, హనుమాన్‌గఢి, లతాచౌక్, గుప్తర్ ఘాట్, సూరజ్‌కుండ్, ఇతర ప్రఖ్యాత స్థలాల వద్ద భారీగా భద్రతా ఏర్పాటు చేశాం’’ అని అయోధ్య పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
అయోధ్య, వారణాసి ఆలయాలను దర్శించుకునే భక్తుల కారణంగా..ఉత్తరప్రదేశ్‌కు పర్యటకులు భారీగా తరలివస్తుంటారు. ‘‘రామ మందిర ప్రారంభం తర్వాత మొదటి ఆరు నెలల్లో యూపీకి పర్యటకుల రాక గణనీయంగా పెరిగింది. ఒక జనవరిలోనే రికార్డు స్థాయిలో ఏడుకోట్లమంది సందర్శించారు’’ అని ఇటీవల యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.





