
పల్నాడు జిల్లా రొంపిచర్ల గ్రామ శివారులోని వేణుగోపాలస్వామి దేవాలయానికి వెళ్లే దారిలో క్రీస్తు శకం 10–13 శతాబ్దాల కాలానికి చెందిన శిల్పాలు, శాసనాలు భూమిలో కూరుకుపోయి నిర్లక్ష్యంగా పడి ఉన్నాయని వాటిని పరిరక్షించుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి (సీసీవీఏ), ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక మధుచౌక్‌లోని సీసీవీఏ కార్యాలయం ఆవరణలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. వారసత్వ సంపదను గుర్తించి పరిరక్షించుకుని భవిష్యత్ తరాలకు అందించడానికి సీసీవీఏ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా రొంపిచర్ల గ్రామంలో పర్యటించానన్నారు. క్రీస్తుశకం 10వ శతాబ్దానికి చెందిన మహిషాసురమర్థిని, బ్రహ్మ, కుమారస్వామి, భైరవ, నంది విగ్రహాలతో పాటుగా కాకతీయ గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు పాలనకు చెందిన రాతి శాసనాలు అక్కడి భూమిలో కూరుకుపోయి ఉన్నాయన్నారు. క్రీస్తు శకం 1320 నాటి ప్రతాప రుద్రుని శాసనంలో అనంత గోపీనాథ దేవాలయానికి రెడ్ల చెరువు వెనక కొంత భూమిని దానం చేసిన వివరాలు, అలాగే క్రీస్తు శకం 1245 నాటి కోట భీమరాజు మంత్రి వల్లభుడు, రొంపిచర్లలో కట్టించిన గోపీనాథ ఆలయానికి కొంత భూమిని దానం చేసిన వివరాలు ఈ శాసనాల్లో ఉన్నాయని శివనాగిరెడ్డి వివరించారు. రొంపిచర్ల గ్రామ చరిత్రకు సాక్ష్యాలైన ఈ శిల్పాలు, శాసనాలు కాపాడుకుని ఆలయంలో ప్రత్యేకంగా వీటిని భద్రపరిచి భవిష్యత్ తరాలకు అందించాలని శివనాగిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గట్టుప్పల్ శ్రీనివాస్, బి.వెంకటరెడ్డి తనకు సహకరించారన్నారు.





