News

భవానీ దీక్షల విరమణ.. ఇంద్రకీలాద్రిపై భారీ రద్దీ

286views

భవానీ దీక్షల విరమణతో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భారీగా రద్దీ నెలకొంది. దీక్షల విరమణ చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున భవానీలు తరలివస్తున్నారు. ఆలయ అధికారులు అన్ని క్యూ లైన్లలోనూ ఉచితంగానే దుర్గమ్మ దర్శనానికి అనుమతిస్తున్నారు. క్యూలో ప్రవేశించిన వారికి దర్శనం పూర్తయ్యేసరికి 2నుంచి 3గంటల సమయం పడుతోంది. జగన్మాత నామస్మరణతో ఇంద్రకీలాద్రి ప్రతిధ్వనిస్తోంది.

అమ్మవారి దర్శనం అనంతరం భవానీ ఘాట్‌, పున్నమి ఘాట్‌, సీతమ్మవారి పాదాల సమీపంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక కేశఖండనశాల వద్ద దీక్షాదారులు తలనీలాలు సమర్పిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత అన్నప్రసాదం అందిస్తున్నారు. ఇవాళ పూర్ణాహుతితో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం పరిసమాప్తం కానుంది.

తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తరలివస్తోన్న భవానీలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఆలయ ఈవో రామారావుతోపాటు విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ బాబు, ఇతర శాఖల అధికారులు మోడల్‌ గెస్ట్‌హౌస్‌ వద్ద ఏర్పాటు చేసిన సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి భక్తుల రద్దీ, దర్శనాలు, ఇతర సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.