News

శ్యామ్ బెనగల్‌కి శ్రద్ధాంజలి ఘటించిన ఆరెస్సెస్

312views

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్యామ్ బెన‌గ‌ల్ మృతికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శ్రద్ధాంజలి ఘటించింది. ఈ మేరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే ఓ ప్రకటన విడుదల చేశారు. భారతీయ చలన చిత్ర దర్శకత్వానికి విలక్షణ సంతకం బెనగల్ అని అన్నారు. ఆయన మరణంతో ఓ సృజన్మాతక కళాకారుడ్ని కోల్పోయామన్నారు. వారికి నివాళులు అర్పిస్తున్నానని, వారి కుటుంబీకులకు, ఆత్మీయులకు సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. బెనగల్ ఆత్మకి భగవంతుడు సద్గతులు కలుగజేయాలని హోసబళే ప్రార్థించారు.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్యామ్ బెన‌గ‌ల్(90) క‌న్నుమూశారు. బెనెగల్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆయన ముంబైలోమృతి చెందినట్లు ఆయన కుమార్తె పియా బెనెగల్ మీడియాకు తెలిపారు. డిసెంబర్ 14న తన 90వ పుట్టినరోజును స్నేహితులు, కుటుంబ సభ్యులతో దర్శకుడు బెనగల్ జరుపుకున్నారు.
బెనెగల్‌ మృతిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సినీ ప్రముఖులు శేఖర్‌ కపూర్‌, హన్సల్‌ మెహతా, మనోజ్‌ బాజ్‌పాయి, అక్షయ్‌ కుమార్‌, కాజోల్‌ సంతాపం వ్యక్తం చేశారు. అద్భుతమైన దర్శకులు, మేధావులలో ఒకరైన శ్యామ్‌ బెనెగల్‌ మృతి తనను తీవ్రంగా బాధించిందని ప్రముఖ తెలుగు నటుడు చిరంజీవి సంతాపం ప్రకటించారు.

1934 డిసెంబర్‌ 14న హైదరాబాద్‌లో జన్మించిన శ్యామ్‌ బెనెగల్‌ కొంకణీ మాట్లాడే చిత్రపూర్‌ సారస్వత్‌ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. కర్ణాటకకు చెందిన శ్యామ్‌ బెనెగల్‌ తండ్రి శ్రీధర్‌ బీ బెనెగల్‌ ఫొటోగ్రాఫర్‌ కావడంతో కెమెరా పట్ల శ్యామ్‌కు చిన్నప్పటి నుంచే ఆసక్తి ఏర్పడింది. తన 12వ ఏట తన తండ్రి బహుమతిగా ఇచ్చిన కెమెరాతో శ్యామ్‌ బెనెగల్‌ తన మొదటి చిత్రాన్ని తీశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ పొందిన ఆయన హైదరాబాద్‌ ఫిల్మ్‌ సొసైటీని స్థాపించి తన సినీ ప్రయాణానికి బాటలు వేసుకున్నారు.

ప‌ద్మ శ్రీ, ప‌ద్మ‌భూష‌ణ్‌, దాదా సాహెబ్ ఫాల్కే, ఏఎన్ఆర్ జాతీయ అవార్డుల‌ను శ్యామ్ బెన‌గ‌ల్ అందుకున్నారు. హైదరాబాద్ ఫిల్మ్ సొసైటీని కూడా స్థాపించాడు, సినిమా రంగంలో తన అద్భుతమైన ప్రయాణానికి నాంది పలికాడు. సికింద్రాబాద్ ప్ర‌భుత్వ కాలేజీలో డిగ్రీ చ‌దివారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి ఎంఏ ఎక‌నామిక్స్ ప‌ట్టా పొందారు. సామాజిక స‌మ‌స్య‌లు, ఆర్థిక అస‌మాన‌త‌ల‌పై ఆయ‌న సినిమాలు రూపొందించారు. ఎనిమిది సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు.

కాపీ రైటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన బెనెగ‌ల్ 1962లో గుజరాతీలో తన మొదటి డాక్యుమెంటరీ చిత్రం ఘేర్ బేతా గంగా (గంగా నది వద్ద) తీశాడు. 2005లో సినిమా రంగంలో భారతదేశ అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించారు. 1978లో వాణిశ్రీ, అనంతనాగ్‌లతో ఆయన తీసిన ఏకైక తెలుగు చిత్రం అనుగ్రహం 1979 బెర్లిన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు నోచుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది.