
హిందుత్వ సిద్ధాంతకర్త వీర సావర్కర్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం “భారతరత్న” ఇవ్వాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన నేత ఉద్ధవ్ థాకరే డిమాండ్ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాల కోసం నాగపూర్‌లో ఉన్న థాకరే మీడియాతో మాట్లాడుతూ, వీరసావర్కర్‌కు బీజేపీ ఎందుకు భారతరత్న ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని పునరుద్ఘాటించారు.
థాకరే డిమాండ్‌పై మిశ్రమ స్పందన
వీర సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలనే ఉద్ధవ్ థాకరే డిమాండ్‌పై రాజకీయ మిత్రులు, ప్రత్యర్థుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. మహారాష్ట్రలో థాకరే మిత్రపక్షమైన ఎన్సీపీ ఎస్పీ నేత శరద్ పవార్ ఈ అంశంపై మౌనం వహించారు. ఉద్ధవ్ థాకరే ఏమి చెప్పారో, ఆయన డిమాండే ఏమిటో తనకు తెలియదని, దానిపై తాను కామెంట్ చేయనని ఎన్సీపీ నేత జితేంద్ర అవధ్ అన్నారు. ఏక్నాథ్ షిండే శివసేన నేత, క్యాబినెట్ మంత్రి భరత్ గోగావలే మాట్లాడుతూ, వీరసావర్కర్‌కు అవార్డు అంశంపై మహాయుతి నేతలు సమష్టి నిర్ణయం తీసుకుంటారని, హిందుత్వకు దూరమైన ఉద్ధవ్ థాకరేకు వీర సావర్కర్ గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు.





