
భారతీయులను అనేక రకాల అవమానాలకు, హింసాకాండకు బలిచేస్తున్నఆంగ్లేయుల పరిపాలనఫై భగ్గున మండిపడిన వాడు భగత్ సింగ్. మాతృభూమి సేవలో నవ్వుతూ జీవితాన్నిబలిదానం చేయగల దృఢ సంకల్పంతో ఆంగ్లేయులనెదిరించిన విప్లవవీరుడు భగత్ సింగ్. వురికంబమెక్కేందుకు తొందరపడుతూ, నాకు మళ్ళీ విప్లవకారునిగానే జన్మనివ్వమని భగవంతుణ్ణి ప్రార్దించిన ఒక అగ్నికణం మన సర్దార్ భగత్ సింగ్.
జలియన్ వాలాబాగ్ లో జరిగిన నరమేధంతో ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవలసిందే నన్న భావన భగత్ లో మరింత బలపడింది.

భగత్ తన అభిప్రాయాన్ని తండ్రికి చెప్పి ఆయన అనుమతి కోరాడు. స్వయంగా విప్లవకారుడైన తండ్రి కొడుక్కి సంతోషంగా అనుమతినిచ్చాడు. భగత్ సింగ్ చదువు విడిచి పెట్టాడు. జాతీయోద్యమంలో చేరిపోయాడు.
1922వ సంవత్సరంలో కాంగ్రెస్ ఒక ఊరేగింపు చేసింది. అదే సమయంలో కొందరు విప్లవకారులు పోలీసులను ఒక గృహంలో బంధించి దానికి నిప్పంటించారు. అంతకుముందు ముంబాయి, మద్రాసులలో కూడా ఇదే తరహాలో హింసాత్మక సంఘటనలు జరిగాయి. మహాత్మా గాంధీ ఈ సంఘటనల పట్ల విచారగ్రస్తులయ్యారు . సహాయ నిరాకరణోద్యమాన్ని ఆపేయవలసిందిగా ప్రజలను ఆదేశించారు. ఉద్యమం ఆగిపోవడం భగత్ సింగ్ కు ఆందోళన, నిరాశ కలిగించింది. అప్పుడతని వయసు 15 సంవత్సరాలు . అహింస పట్ల, సహాయ నిరాకరణోద్యమం పట్ల భగత్ సింగ్ కు గల నిష్ఠను భంగపరిచాయి. దేశానికి స్వాతంత్ర్యం రావాలంటే సాయుధ పోరాటమే మార్గమని దృఢంగా విశ్వసించి భగత్ సింగ్ ముందుకు సాగిపోయాడు.
పెద్దలు పెళ్ళి గురించి ఒత్తిడి చేయగా ఇల్లు వదిలేందుకు నిర్ణయించుకుని ఒక లేఖ వ్రాసి పెట్టాడు. ఆ లేఖలో “నా జీవిత లక్ష్యం భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడాడటం. సంసార సుఖాలఫై నాకు కోరిక లేదు. నా స్వంత సుఖాలను త్యజించి, దేశ సేవ కోసం ఇల్లు విడిచి వెళ్తున్నాను.” అని వ్రాసి పెట్టి వెళ్ళిపోయినటువంటి త్యాగ మూర్తి మన భగత్ సింగ్.
1928వ సంవత్సరంలో ఇంగ్లాండ్ నుండి మన దేశానికి సైమన్ కమీషన్ వచ్చింది. ఆ కమిషన్ కు వ్యతెరేకంగా ఒక ఊరేగింపుకు లాలా లజపతి రాయ్ నాయకత్వం వహించారు. సైమన్ కమిషన్ ను ముందుకు పోనివ్వ లేదు. ఆ సమయంలో జరిగిన లాఠీఛార్జిలో లాలా లజపతి రాయ్ మరణించాడు.
లాలాజీ ఛాతిపై లాఠీతో మోదిన ఆ సాండర్సన్ ను భగత్ సింగ్ చంపేశాడు. సాండర్సన్ హత్య బ్రిటీషు ప్రభుత్వాన్ని గడగడలాడించింది. భగత్ సింగ్ ఒక విదేశీ యువకుడి వేషం వేసుకొని తలపై టోపీ పెట్టుకుని సురక్షితంగా బయట పడ్డాడు. పోలీసు గాలింపులు జరుగుతూనే వున్నాయి. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇలా మూడు నెలలు గడిచాయి.
సాండర్సన్ హత్యానంతరం లాహోర్ లో పోలీసులు ప్రజలను హింసించటం ఎక్కువైంది. దీన్ని వ్యతిరేకిస్తూ విప్లవ కారులు తమకు తాము స్వచ్ఛందంగా అరెస్ట్ కావాలని నిర్ణయించారు. అయితే ప్రజలకు తమ సందేశం అందించేందుకు ఢిల్లీలో జరిగే సెంట్రల్ అసెంబ్లీ సమావేశాల్లో ఎవరినీ గాయపరచని బాంబు విసిరి, స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యారు.

భగత్ సింగ్, అతని అనుచరులకు వ్యతిరేకంగా విచారణ ప్రారంభమైంది. కోర్టులో భగత్ సింగ్ వివరణ ఇలా వుంది. “చెవిటివాడు వినాలంటే అతనికి చాలా పెద్ద స్వరంతో చెప్పాల్సి వుంటుంది. మేము బాంబులు విసిరింది ఎవరినీ హత్య చేయటానికి కాదు. మేము బ్రిటిష్ ప్రభుత్వంపై బాంబులు విసిరాం. ఆంగ్లేయులు భారత్ ను విడిచి వెళ్ళాలి. మా దేశం స్వతంత్ర దేశం కావాలి” అని భగత్ సింగ్ తమ సంస్థ ఉద్దేశ్యం గురించి వివరించాడు. యావత్ ప్రపంచానికి వారి గురించి పత్రికల ద్వారా తెలిసిపోయింది. చివరగా కోర్టు తీర్పు చెప్పింది. భగత్ సింగ్ కు ఉరిశిక్ష పడింది. భగత్ సింగ్ కు ఉరిశిక్ష విధించిన వార్త దేశమంతా ప్రాకింది. జనం ఆగ్రహోదగ్రులయ్యారు. భగత్ సింగ్ కు ఉరిశిక్ష విధించ వద్దని ప్రభుత్వానికి వేలాదిగా విజ్ఞాపనలు అందాయి.
1931వ సంవత్సరంలో మార్చి 24వ తేది ఉరిశిక్ష వేసేందుకు నిర్ణయం జరిగింది. వారి కుటుంబ సభ్యులు వారిని కలిసేందుకు అనుమతినివ్వలేదు. నిర్ణయించిన తేదీకి ఒక రోజు ముందుగానే అంటే మార్చి 23న ఆంగ్లేయ ప్రభుత్వం వారిని ఉరి తీసింది.

స్వాతంత్ర్య సంగ్రామంలో వీరోచితంగా పోరాడి తమ జీవితాన్ని బలి ఇచ్చిన భగత్ కు దేశమంతా ఆదరపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటించింది. ఈనాటికీ భగత్ సింగ్ ఆత్మ ఈ దేశపు యువకుల హృదయాలలో త్యాగం, బలిదానం, అత్మసమర్పణ ఇత్యాది భావనలను జాజ్వల్యమానంగా ఉంచుతూనే వుంది. ఆయన సాహసం, అసాధారణమైన పనులు చేయడంలో గల నిష్ఠ మరియు అకుంఠిత దేశభక్తి నేటికి సైతం అందరికి ప్రేరణనిస్తూనే ఉన్నాయి.
తే 28/9/2019 ది షహీద్ భగత్ సింగ్ జయంతి.





