
మతం మారనని కోడలు తెగేసి చెప్పడంతో అత్తమామలు ఆమెను తీవ్రంగా వేధింపులకు గురి చేసిన ఘటన రాజస్థాన్ లోని సిరోహి జిల్లాలో జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ మహిళే వెల్లడించింది. మతం మారమని రోజూ తన అత్తా మామలు ఒత్తిడి తెస్తున్నారని, తాను మారనని చెప్పడంతో రోజూ చిత్రవధకు గురి చేస్తున్నారంటూ వాపోయింది. అంతేకాకుండా ఇంట్లో గొలుసులతో కట్టేసి, బంధించారని, శారీరకంగా చిత్రవధ పెడుతున్నారని వెల్లించింది. దీంతో కోడలు తన అత్తామామలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో అత్తా మామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాను హిందూ విశ్వాసాన్ని ప్రగాఢంగా నమ్ముతానని, కానీ.. తనను క్రైస్తవ మతంలోకి మారమని బలవంతపెడుతున్నారని, ఈ విషయాన్ని తాను తన తల్లిదండ్రులకు దృష్టికి తెచ్చానని పేర్కొంది. చివరికి తన తల్లిదండ్రులు, తాను కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపింది. తనకు ఓ శిశువు కూడా వుందని, మతం మారనని తెగేసి చెప్పడంతో ఆ శిశువును కూడా తన నుంచి దూరం చేశారని వెల్లడించింది. తనంతట తాను నడవలేని స్థితిలోకి నెట్టేసి, చిత్ర హింసలు పెట్టారని వాపోయింది.
వివాహం జరిగిన కొన్ని రోజుల పాటు అత్తామామలు బాగానే వుండేవారని, ఆ తర్వాతే మతం మారని ఒత్తిళ్లు పెరిగాయని ఆమె తెలిపింది. తననే కాదు.. తన మామ అందరిపై ఇలాగే ఒత్తిడి తెస్తాడని, సోషల్ మీడియాలో కూడా మత ప్రచారం, ప్రలోభాలు చేయడం చేస్తుంటాడని ఆ మహిళ వెల్లడించింది. హిందూ విశ్వాసాలను, దేవుళ్లను ఘోరంగా అవమానిస్తారని, క్రైస్తవ ప్రార్థనలకు రావాలని ఒత్తిడి తెస్తాడని కూడా చెప్పింది. ఈ వేధింపుల్లో తన భర్తకి కూడా భాగముందని పేర్కొంది.దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.





