News

1016 మంది మహిళలతో.. సహస్ర సుందరకాండ పారాయణం

246views

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సహస్ర సుందరకాండ పారాయణం, హనుమాన్‌ చాలీసా పారాయణం ఆద్యంతం ఆకట్టుకుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమై నిరాటంకంగా నాలుగు గంటల పాటు కొనసాగింది. నరసన్నపేటతో పాటు పరిసర గ్రామాలకు చెందిన 1016 మంది మహిళలు హాజరై ఒకేసారి పారాయణం చేయడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఒకేసారి భారీ ఎత్తున కార్యక్రమంలో పాల్గొని పారాయణం చేయడంతో వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం లభించిందని ప్రతినిధి రూప్‌నాథ్‌ తెలిపారు. ఈమేరకు శ్రీ లక్ష్మీ నరసింహ కోలాట భజన బృందానికి సర్టిఫికెట్‌ ఇచ్చామన్నారు.

గతంలో ఇటువంటి పారాయణాలు జరిగినా ఏక బిగిన సుందరాకాండ పారాయణం, హనుమాన్‌ చాలీషా పారాయణం రెండూ కలిసి జరగలేదన్నారు. లోక కల్యాణార్థం నిర్వహించిన స్థానిక సత్యనారాయణస్వామి ఆలయ అర్చకులు చామర్తి శ్రీనివాసాచార్యులు, వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు చామర్తి కృష్ణామాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలోలక్ష్మీ కోలాట బజన బృందం, విశ్వహిందూ పరిషత్‌(నరసన్నపేట), వారణాశి సంతోషి, పూర్ణా నాగరాజు, వారణాశి రమేష్‌, కేఎల్‌ఎన్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.