News

టీటీడీ ఛైర్మన్‌‌గా ప్రమాణం చేసిన బీఆర్‌ నాయుడు

280views

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. బంగారు వాకిలిలోని జయ విజయలు దగ్గర బీఆర్‌ నాయుడుతో టీటీడీ ఈవో , అదనపు ఈఓ, జేఈఓల సమక్షంలో ప్రమాణం చేయించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి మూలవిరాట్టును టీటీడీ ఛైర్మన్‌ హోదాలో బీఆర్‌ నాయుడు దర్శించుకున్నారు.

తిరుమల రంగ నాయకుల మండపంలో టీటీడీ 54వ చైర్మన్‌గా బి.ఆర్.నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో బీఆర్ నాయుడు చేత ఈవో శ్యామలరావు ప్రమాణ స్వీకారం చేయించారు. టీటీడీ పాలకమండలి సభ్యులుగా పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే 17 మంది సభ్యులు కూడా ప్రమాణం చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నూతన ఛైర్మన్ గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు (72) నియమితులయ్యారు. టీవీ5 ఛైర్మన్ గా ఇరు తెలుగు రాష్ట్రాలకు బీఆర్ నాయుడు సుపరిచితులు. మీడియా సంస్థ యజమానిగా, వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా బీఆర్ నాయుడు సేవలను గుర్తించిన సీఎం చంద్రబాబు టీటీడీ బోర్డు ఛైర్మన్ గా అవకాశం కల్పించారు.

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం దిగువ పూనేపల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన బీఆర్ నాయుడు చిన్నతనం నుంచి స్వయంకృషితో ఎదిగారు. తల్లిదండ్రులు మునిస్వామి నాయుడు- లక్ష్మిల ఆరుగురు సంతానంలో చివరివాడైన బీఆర్ నాయుడు స్థానికంగా చదువు పూర్తి చేసిన నాయుడు తరువాత సాంకేతిక విద్య నేర్చుకొని హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో ఉద్యోగంలో చేరారు.