ArticlesNews

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం

520views

( అక్టోబర్‌ 21 – పోలీసు అమరవీరుల సంస్మరణ దినం )

ప్రభుత్వం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది. ప్రతి ఒక్కరు ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులనే ! అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళల్లో సర్వ కాల.. సర్వా వ్యవస్తలందు.. పోలీసులే ముందుంటారు. సంపన్నుడు మొదలు సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ ప్రతీ అవసరానికి సాయం కోరేది పోలీసులనే! . పోలీసు విధి నిర్వహణ చాలా శ్రమతో కూడుకున్నది, ఇతర ఉద్యోగుల్లా కొన్ని గంటలకు మాత్రమే పరిమితమయింది కాదు, ఇరవైనాలుగు గంటల ఉద్యోగం. ఒక్క పోలీసు ఉద్యోగమే! పోలీసులు లేని సమాజాన్ని ఉహించుకోలేం. దండెత్తి వచ్చే శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే వారు సైనిక జవానులైతే, అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడి, భద్రతకు భరోసా ఇచ్చేది, సామాజిక ఆస్తులను సంరక్షించేది పోలీసులు. ప్రపంచమంతా నిద్రపోయినా మేల్కొని వుండే ఒకే ఒక్క రక్షక భటుడు పోలిస్

అక్టోబర్‌ 21వ తేదీ పోలీసు శాఖలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న రోజు. 1959 సంవత్సరంలో అక్టోబర్‌ 21 కేంద్ర రిజర్వు బలగానికి చెందిన సిబ్బంది, దేశ సరిహద్దులలోని ఆక్సాయిచిన్‌ ప్రాంతంలో విధులు నిర్వహిస్తుండగా హఠాత్తుగా పెద్ద సంఖ్యలో చైనా దేశానికి చెందిన సైనికులు దాడి చేశారు. ఈ ఘటనలో భారత జవానులు ఎంతో సాహసంతో, పోరాడి దేశం కోసం అమరులైయ్యారు. కర్తవ్య దీక్ష లో అసువులు బాసిన పోలీసు అమర వీరులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 21 వ తేదీన పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజున దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాల ద్వారా ప్రజలకు పోలీసులు చేస్తున్న త్యాగాలు, విధుల పట్ల అవగాహన కల్పిస్తున్నారు.

పోలీసులు లేని సమాజాన్ని ఏమాత్రం ఊహించలేం. వ్యవస్థ సాఫీగా నడవడంలో పోలీసులదీ కీలకపాత్రే. ఈ దేశ సరిహద్దులలో విధులు నిర్వహించేది, దేశ అంతర్గత భద్రత కల్పించేది పోలీసు మాత్రమే. నిరంతరం ప్రజలకు అన్నిసమయాలలో అందుబాటులో ఉండేది పోలీసులే. తమ ప్రాణాలకు తెగించి సమాజ రక్షణకు పాటుపడుతూ ఉంటారు. ఆపదలో వున్నవారికి ఖాకీ యూనిఫాంలో కనిపించే పోలీసులను చూస్తే కొండత ధైర్యం కలుగుతుంది. అంతెందుకు కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో ప్రపంచానికి తాళం పడిన వేళలోనూ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పోలీసులు తమ విధులతో పాటు కోవిడ్ బాధితులకు, మరణించిన వారికి చేసిన సేవలు అభినందనీయం, వెలకట్టలేనివి.

పోలీసులు కుటుంబానికి దూరంగా విధి నిర్వహణే పరమావధిగా భావిస్తూ ప్రాణాలను తృణప్రాయంగా వదిలిన ఘటనలు అనేకం వుంటాయి. పోలీసు కర్తవ్యనిర్వహణలో భాగంగా శాంతిభద్రతలను అదుపులో పెట్టడం, నేరగాళ్ళను నియంత్రించడం వంటివే కాకుండా అంతర్గత భద్రతను కాపాడే పనిలో ప్రజల రక్షణే ధ్యేయంగా నిర్విరామంగా విధులు నిర్వహిస్తూ పోలీసులు ప్రాణాలను సైతం అర్పిస్తున్నారు.

ఒకవైపు ఆధునీకరణ దిశగా పోలీసింగ్ లో సరికొత్త విధానాలు ఉపయోగించుకుంటూ, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలోనూ.. మెరుగైన సేవలను పౌరులకు అందిస్తూనే మరో వైపు అంతేస్థాయిలో సరికొత్త ఆలోచనలతో నేరాలకు పాల్పడుతున్న నేరస్తులను మరింత సమర్థవంతంగా అణచివేసేందుకు అటు దేశ సరిహద్దుల్లోనూ, ఇటు సమాజంలోని శాంతిభద్రతలకు పోలీస్ శాఖ నిర్విరామ కృషి చేస్తోంది. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనిషి తలెత్తుకుని తిరగగలడో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో… అక్కడ ఆ స్వేచ్ఛా స్వర్గంలోని నా దేశాన్ని మేలుకొలుపు అని గీతాంజలిలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రార్థించారు. అటువంటి స్వేచ్చా స్వర్గాన్ని సమాజానికి తమ విధుల నిర్వహణతో అందించేది పోలీసులే. అంతటి నిస్వార్థమైన, అంకితభావంతో కూడిన సేవలందిస్తూ, ప్రజా రక్షణలో అమరులైన పోలీసులకు జోహార్లు.