
స్వదేశీ పదం సంకుచిత శబ్దం కాదు. ఆత్మాభిమానానికి, స్వావలంబనకు ప్రతీక. ఆధునిక కాలంలో అన్ని దేశాల మధ్య దూరం బాగా తగ్గిపోయింది. గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ విధానాలతో వ్యాపారాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో కొనసాగడం సహజం. ఈ స్థితిలో ‘స్వదేశీ’ అంటూ మన దేశం తలుపులు బిగించుకుని కూర్చుంటే ప్రగతి ఎలా సాధ్యం ? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే దేశం అంటే కేవలం వ్యాపార లావాదేవీలు, లాభనష్టాలు మాత్రమే కాదు. తమ కాళ్ళ మీద తాము నిలబడి పదిమందికి ఉద్యోగాలు ఇస్తూ ఆర్థికంగా అందరినీ స్వతంత్రులుగా రూపొందించడం, వేల సంవత్సరాల మన సంస్కృతీ సంప్రదాయాలతో మమేకమై స్వాభిమానంతో జీవించడం కోసం ప్రయత్నం చేయడం కూడా ‘స్వదేశీ’యమే.. ‘మాతా భూమి: పుత్రోహం పృథివ్యా: అంటే ఈ భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుడను అని అధర్వణ వేదం చెబుతుంది. నా దేశం తల్లి వంటిది. నా స్వార్థం కోసం తల్లిని అమ్మకానికి పెట్టే దేశద్రోహ వ్యాపారాలకు కేంద్రంగా నా భూమిని మార్చవద్దు. లంకను గెలిచి అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యే సమయంలో లక్ష్మణుడికి బంగారు లంక పట్ల ఆసక్తిని గమనించిన శ్రీరాముడు ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అంటూ తల్లి మరియు జన్మభూమి స్వర్గం కంటే మిన్న అని వ్యాఖ్యానించడం వెనక అర్థం విదేశీ అలవాట్లు మనకు సరిపడవని, కనుక మోజువద్దని చెప్పడం.
స్వదేశీకి, మంచి ఉదాహరణ, అలాగే భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగం 35వ శ్లోకంలో “శ్రేయాన్ స్వధర్మో విగుణ: పర ధర్మాత్ స్వనుష్టితాత్, స్వధర్మే నిధనం శ్రేయపరధర్మో భయావహః”, వేల సంవత్సరాల చరిత్ర గల మన సంస్కృతీ సంప్రదాయాలతో మన పూర్వీకులతో ఉన్న తరతరాల సంబంధ బాంధవ్యాలతో మమేకమైన మన మానసిక స్థితియే మన నిజమైన స్వధర్మం. ఇందులోనే నాకు ప్రగతి గలదు. పరధర్మం కొత్తదే కాకుండా భయం గొల్పుతుంది. నా ధర్మంలోనే మరణించడం నాకు శ్రేయస్సునిస్తుంది. ఇది కూడా స్వదేశీ భావనయే.స్వదేశీ అంటే వస్తువులు మాత్రమే కాదు. హృదయ పూర్వకభావన. నా దేశపు భౌతిక, ఆధ్యాత్మిక రంగాల అభివృద్ధిలోనే నా వికాసం కూడా మిళితమై ఉంది. ఇదే “స్వదేశీ”.





