News

భారత్ సైన్యం చేతిలో ఇద్దరు పాక్ జవాన్లు హతం – తెల్ల జెండాలతో వచ్చి మృత దేహాలు తీసుకెళ్ళిన పాక్

782views

పాకిస్థాన్‌ ఆర్మీ  దారికొచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పు ఒప్పుకుంది. చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకుంది. కాల్పులు విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ భారత్‌పైకి జరిపిన దాడిలో ఇద్దరు సైనికులను కోల్పోయింది. తప్పుని అంగీకరించిన పాక్‌ జవాన్లు తెల్ల జెండాలతో వచ్చి మృతదేహాలను తీసుకెళ్లారు. ఆర్మీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 10, 11 తేదీల్లో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని హాజీపూర్‌ సెక్టార్‌ వద్ద పాక్‌ సైన్యం కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. భారత సైన్యంపై కాల్పులకు సాహసించింది.

భారత సైన్యం ఈ చర్యలను దీటుగా తిప్పికొట్టింది. భారత సైన్యం కాల్పుల్లో పాక్‌కు చెందిన గులామ్‌ రసూల్‌ అనే జవాన్‌ ప్రాణాలు కోల్పోయాడు. పాక్ సైనికులు భారత సైన్యంపై భీకర కాల్పులు జరుపుతూ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మరో సైనికుణ్ని పాక్‌ కోల్పోయింది. దీంతో చేసేది లేక తోక ముడిచింది. సెప్టెంబరు 13న కాల్పులకు స్వస్తి పలికి తెల్ల జెండాలను చూపుతూ వచ్చి మృతదేహాలను తీసుకెళ్లారు. భారత్‌ కూడా మృతదేహాలను అప్పగించేందుకు అనుమతించింది.

గతంలో పాక్‌కు చెందిన బోర్డర్‌ యాక్షన్‌ టీం(బ్యాట్‌) సభ్యులు భారత్‌లోకి చొరబడేందుకు యత్నించి దాదాపు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో వారి శవాలను తీసుకెళ్లేందుకు తెల్లజెండాలతో రావాలని భారత్ కోరినప్పటికీ పాక్‌ స్పందించలేదు. వారు తమ సైనికులు కాదని మొండిగా వాదించింది. కానీ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా మృత దేహాలను తెల్ల జెండాలు చూపించి మరీ తీసుకెళ్ళడం భారత్ కు నైతికంగా బలం చేకూర్చే విషయం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.