
సమరసతా సేవా ఫౌండేషన్ SSF ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో 7 విడతలుగా నిర్వహించిన “ఇంటింటికీ ధర్మ ప్రచార కార్యక్రమం” ద్వారా పలు బృందాలుగా దాదాపు 40 లక్షల కుటుంబాలను కలిసి, వివిధ అంశాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి హైందవ ధర్మ ప్రచారం గావించారు. SSF కార్యకర్తల విశేష కృషి కారణంగా ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో షుమారు 7వేల మంది హైందవ ధర్మంలోకి తిరిగి వచ్చారు. అన్య మత ప్రచారకుల వలలో పడకుండా వారిని తిప్పి పంపే విధంగా సామాన్య హిందూ సమాజంలో చైతన్యం కలిగించింది SSF.

TTD సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా హరిజన, గిరిజన వాడల్లో SSF నిర్మించిన పలు దేవాలయాలలో ఆ గ్రామంలో ఆరోగ్యం సరిగా లేని వారిని గుర్తించి వారి ఆరోగ్యం బాగు కోసం స్థానిక గుడిలో వారి గోత్ర నామాలతో పూజచేసి తీర్థ ప్రసాదములను వారింటికి చేర్చడం వంటి కార్యక్రమాలను కూడా SSF నిర్వహిస్తున్నది.
ఇప్పుడు 8వ విడతగా “ఇంటింటికీ మన ధర్మం”, “ఇంటింటికి మన దైవం” అనే పేరుతో అక్టోబరు10 నుండి 20 వరకు 13 జిల్లాలలో, 350 మండలాలలో, పది వేల పల్లెల్లో ధార్మిక చైతన్యం కోసం 9500 బృందాలు, లక్ష మంది కార్యకర్తల గణంతో పది రోజుల పాటు విస్తృత స్థాయిలో “ఇంటింటికీ ధర్మ ప్రచార కార్యక్రమం” SSF నిర్వహించనున్నది.
ఈసారి గిరి పుత్రులకు ప్రత్యేకంగా రూపొందించిన కరపత్ర సందేశంతో వెళ్ళి కలవనుండడం విశేషం.


ఇతర ప్రాంతాల హిందూ బంధువులను కూడా మత మార్పిడి ప్రమాదాల నుంచి రక్షించే ప్రత్యేక సందేశంతో ప్రజల ముందుకు వెళ్ళడానికి SSF సిద్ధమౌతోంది.


ఈ పవిత్ర ధర్మ రక్షా కార్యంలో ఎవరైనా, ఏవిధంగానైనా పాలుపంచుకోవచ్చునని సమరసతా సేవా ఫౌండేషన్ (SSF) రాష్ట్ర కార్యదర్శి శ్రీ త్రినాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. “ధర్మో రక్షతి రక్షితః” అని స్వయంగా భగవంతుడే చెప్పిన ప్రకారం మన స్థాయిలో మన పవిత్ర హైందవ ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి హిందువూ నడుం బిగించాలని శ్రీ త్రినాథ్ పిలిపునిచ్చారు.





