News

వక్ఫ్ బోర్డు రద్దు చేయండి: జేపీసీని కోరిన వీహెచ్‌పీ

13views

వక్ఫ్ బోర్డు చట్ట సవరణపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ సభ్యులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డును వెంటనే రద్దు చేయాలని జేపీసీని కోరారు. వక్ఫ్ బోర్డు చట్టం కేవలం మతం ఆధారంగా ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన అధికారాలను కల్పిస్తోందని, భారతీయులకుండే చట్టపరమైన హక్కులను అది ఉల్లంఘిస్తోందని జేపీసీకి తమ అభిప్రాయాన్ని వీహెచ్ పీ సభ్యులు తెలియజేశారు. అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే వక్ఫ్ బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహమూర్తి, జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం వక్ఫ్ బోర్డు పనితీరులో వెలుగు చూసిన అవకతవకలను జేపీసీ దృష్టికి తెచ్చారు. వేల కోట్ల విలువైన ఆస్తులతో వక్ఫ్ బోర్డు అడ్డూ అదుపు లేని భూకబ్జాలు చేస్తోందని, అవినీతికి సాధనంగా వక్ఫ్ మారిపోయిందన్నారు. ఈ ఆక్రమణల బారిన పడిన బాధితుల హక్కులను కాపాడేందుకు, జవాబుదారీతనాన్ని పునరుద్ధరించడానికి తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని జేపీసీని కోరారు.

ఓవైసీ తీరుపై నిరసన…
అంతకుముందు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి బాధితులను భయపెట్టడానికి మరియు ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆరోపిస్తూ, సమావేశానికి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హాజరుకావడాన్ని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ నేతలు వెలుపల ధర్నా చేశారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ సభ్యులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత ఒవైసీపై ఫిర్యాదు చేశారు. హైదరాబాదులోని తాజ్ కృష్ణా హోటల్‌లో అభిప్రాయ సేకరణ చేస్తున్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఒవైసీ తన అనుచరులతో కలిసి సమావేశ మందిరంలోకి వచ్చారని, అందుకే అసదుద్దీన్‌ను బయటికి పంపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిరసన చేశారు.