ArticlesNews

అక్టోబర్ 2న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా?

55views

వినీలాకాశంలో మరో అద్భుత ఖగోళ ఘట్టం చోటుచేసుకోబోతోంది. అక్టోబర్ 2న సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం ఏర్పడనుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఖగోళ దృగ్విషయంలో సూర్యుడి కంటే చంద్రుడు చిన్నగా కనిపిస్తాడని, చీకటిగా ఉన్న చంద్రుడి కేంద్రం చుట్టూ సూర్యకాంతి ప్రకాశవంతమైన రింగ్ (ఉంగరం) ఆకృతిలో కనిపిస్తుందని వివరించారు. దీనిని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం అని పిలుస్తారు. ఈ ఖగోళ దృశ్యం 6 గంటలకు పైగా కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు

భారత్‌లో కనిపిస్తుందా?
భారత కాలమానం ప్రకారం రాత్రి 9.13 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో మన దేశంలో రాత్రి కావడంతో గ్రహణం కనిపించదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ చిలీ, దక్షిణ అర్జెంటీనాలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుందని వెల్లడించారు. ఈ ఖగోళ ఘట్టాన్ని వీక్షించాలనుకునే భారతీయ ఔత్సాహికులకు ఈ వార్త నిరాశ కలిగించనుంది.

‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం అంటే ఏమిటి?
భూమి, సూర్యుడి కక్ష్యలోకి చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇక ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణంలో సూర్యుడికి ఎదురుగా చంద్రుడు ఉంటాడు. కానీ చంద్రుడి పరిమాణం చిన్నది కావడంతో సూర్యుడి ఉపరితలం ప్రకాశవంతమైన అగ్ని వలయం మాదిరిగా కనిపిస్తుంది. ఈ సమయంలో ప్రకాశవంతమైన ఉంగరం ఆకృతి ఏర్పడుతుంది. అందుకే దీనిని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలుస్తారు.