
గూఢచర్యం చేసేందుకు పాకిస్థాన్ నుంచి మన దేశంలోకి అక్రమంగా చొరబడ్డ ఓ వ్యక్తిని సరిహద్దు భద్రతాసిబ్బంది రాజస్థాన్‌లో అరెస్టు చేశారు. బర్మేర్‌లోని భారత్-పాక్ సరిహద్దు సమీపంలో బీఎస్‌ఎఫ్ జవాన్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆ వ్యక్తి పాకిస్థాన్‌కు చెందినవాడిగా గుర్తించారు. సరిహద్దులో బారికేడ్ల కింది నుంచి పాకుకుంటూ దేశంలోకి చొరబడి ఉంటాడని సిబ్బంది అనుమానిస్తున్నారు.
దర్యాప్తులో అతడు కొన్ని కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. బీఎస్‌ఎఫ్, భారత ఆర్మీ కార్యకలాపాలపై సమాచారం తెలుసుకునేందుకు తన మేనమామే తనను భారత్‌కు పంపినట్లు ఆ వ్యక్తి చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు పాక్ ఆర్మీ కూడా అతడికి సాయం చేసినట్లు బీఎస్‌ఎఫ్ వర్గాల సమచారం. పాకిస్థాన్‌లోని ఖొఖ్రాపర్ వరకు రైలులో వచ్చి.. అక్కడి నుంచి పాక్ ఆర్మీ సాయంతో సరిహద్దు దాటినట్లు విచారణలో తెలిపాడు. అయితే దర్యాప్తు సమయంలో అతడు పదే పదే మాట మార్చుతుండటంతో బీఎస్‌ఎఫ్ అధికారులు అతడిని తదుపరి విచారణ నిమిత్తం జైపూర్‌కు తరలించారు.





