News

‘అహ్మద్‌కు రీనా లేఖ’.. మూడవ తరగతి లెసన్‌పై పోలీసులకు ఫిర్యాదు

5views

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో మూడవ తరగతి చదువుతున్న ఓ బాలిక తండ్రి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకంలోని ఓ పాఠ్యాంశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఓ లెసన్‌ను ‘లవ్‌ జిహాద్‌’గా పేర్కొంటూ, ఎన్‌సీఈఆర్‌టీపై పలు ఆరోపణలు గుప్పిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళితేడాక్టర్ రాఘవ్ పాఠక్ కుమార్తె ఎన్‌సీఈఆర్‌టీ బోర్డు పాఠ్యాంశాలు బోధించే పాఠశాలలో హిందీ మీడియంలో మూడవ తరగతి చదువుతోంది. ఆ చిన్నారికి సంబంధించిన పర్యావరణ సబ్జెక్ట్‌లోని 17వ లెసన్‌ ‘చిట్టీ ఆయీ హై’ పేరుతో ఉంది. ఇందులో రీనా అనే అమ్మాయి తన స్నేహితుడైన అహ్మద్‌ను సెలవుల్లో అగర్తలాకు రమ్మని ఆహ్వానిస్తూ లేఖ రాస్తుంది. ఈ లేఖ చివరిలో ‘నీ రీనా’ అని రాస్తుంది. దీనిని గుర్తించిన డాక్టర్ రాఘవ్ పాఠక్‌ ఈ లెసన్‌ ‘లవ్ జిహాద్’ మాదిరిగా ఉందని ఆరోపించారు. అలాగే ఈ లేఖ లవ్ జిహాద్‌కు ఊతమిస్తుందంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఒక హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయికి లేఖ రాయడం, పైగా చివరిలో ‘నీ రీనా’ అని రాయడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ లేఖను చదివిన పిల్లల మదిలో లవ్ జిహాద్‌పై ఆకర్షణ పెరుగుతుందని, భవిష్యత్తులో లవ్ జిహాద్ లాంటి ఘటనలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. లవ్ జిహాద్ లాంటి ఘటనలను అరికట్టేందుకు ఒకవైపు ప్రభుత్వం కఠిన చట్టాలు చేస్తుండగా, ఎన్‌సీఈఆర్‌టీకి చెందిన ఈ పుస్తకం లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నట్లున్నదని ఆయన ఆరోపించారు.

ఈ పుస్తకంలోని 17వ లెసన్‌లో అహ్మద్- రీమా లేఖను తక్షణం మార్చాలని లేదా తొలగించాలని తాను కోరుకుంటున్నానని, తన కుమార్తె ఈ లెసన్‌ చదివాక ఆమె మనసులో ఎలాంటి తప్పుడు భావన తలెత్తకూడదని భావిస్తున్నానని ఆయన అన్నారు.

ఈ విషయమై ఖజురహో పోలీసు అధికారి సునీల్ శర్మ మాట్లాడుతూ ఎన్‌సీఈఆర్‌టీ పర్యావరణ పుస్తకంలోని ఒక లెసన్‌ లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ వచ్చిన ఫిర్యాదును సీనియర్ అధికారులకు పంపినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.