News

సరిహద్దుల్లో కొనసాగుతున్న పాక్ దుశ్చర్యలు.

528views

పాకిస్థాన్‌ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకొంది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే తమ పరిధిలో ఉన్న సట్లేజ్‌ నదిపై ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసింది. దీంతో భారత్‌లోని పంజాబ్‌కి ఒక్కసారిగా వరద ముంచెత్తింది. సట్లేజ్‌ నదీ పరీవాహక ప్రాంతమైన ఫిరోజ్‌పూర్‌ జిల్లాలోని పలు గ్రామాలు వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. తెండీవాలా గ్రామం వద్ద ఉన్న కరకట్ట తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో అప్రమత్తమైన పంజాబ్‌ ప్రభుత్వం ఆదివారం జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించింది. వెంటనే రంగంలోకి దిగిన జాతీయ విపత్తు స్పందన దళాలు, సైనిక సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం పునరావాస కార్యక్రమాలను చేపట్టింది. ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. సరిహద్దు గ్రామాల్లో సైనిక, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో సమన్వయం చేసుకొని సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ఆదేశించారు. తెండీవాలా సమీపంలోని కరకట్ట పునరుద్ధరణకు చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం పాక్‌కి కొత్తేమీ కాదు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా గతంలోనూ పలుసార్లు ప్రాజెక్టు గేట్లు ఎత్తేశారు.