
చిత్తూరు జిల్లా తిరుమల-తిరుపతి మధ్య తిరిగే ఆర్టీసీ బస్సుల్లో అన్యమత ప్రచారం ఆరోపణల వ్యవహారంపై విచారణ పూర్తి చేసిన ఆర్టీసీ యాజమాన్యం బాధ్యులపై చర్యలకు ఉపక్రమించింది. గత ప్రభుత్వ హయాంలో ముద్రించిన టిక్కెట్ రోల్స్‌ను సరిచూసుకోకుండా ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యంగా జారీ చేయడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ఆర్టీసీ నిర్దారణకు వచ్చింది. ఈ క్రమంలో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా గత ప్రభుత్వ ప్రకటనలతో కూడిన టిక్కెట్ రోల్స్‌ను జారీ చేసిన నెల్లూరు జోనల్ స్టోర్స్ కంట్రోలర్ ఎం. జగదీశ్ బాబుపై వేటు పడింది. ఆయన్ను తక్షణం విధుల నుంచి తొలగిస్తూ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలకు ముందు అప్పటి తెదేపా ప్రభుత్వ హయాంలో అమలైన పథకాలతో మైనార్టీ శాఖ ద్వారా ఆర్టీసీకి ప్రకటనలు వచ్చాయి. ఎన్నికల కోడ్ రావడంతో వీటి జారీని నిలిపివేస్తూ మార్చి 13న ఆర్టీసీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా తదుపరి ఉత్తర్వులు వెలువడక ముందే నిర్లక్ష్యంగా వెయ్యి రోల్స్‌ను కంట్రోలర్ తిరుమల డిపోకు అందజేసినట్లు విచారణలో తేలింది.





