ArticlesNews

ప్రప్రథమ సనాతన ఉద్యమ సారధి గాజుల లక్ష్మీనరసు చెట్టి (1806-1868)

67views

-డా. సుందర్ కొంపల్లి

హైందవ సనాతన ధర్మ వ్యవస్థపై వలసవాదుల ఆధ్వర్యంలో సంస్థాగతంగా దాడి జరుగుతోందని పసిగట్టి, దానికి వ్యతిరేకంగా భారీస్థాయిలో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి, నిర్వహించిన ఒక గొప్ప సాంస్కృతిక పురుషుడు సారధి గాజుల లక్ష్మీనరసు చెట్టి. వలసవాద ప్రభుత్వం పటిష్టంగా వేళ్ళూనుకొంటున్న 19వ శతాబ్ది ప్రథమార్థ భాగంలోనే ఇంత పెద్ద ఉద్యమాన్ని రగుల్కొలిపి, హిందూ సాంస్కృతికతను, హైందవ ధార్మికతను రక్షింప బూనుకొన్న మహనీయుడతడు.

కోరమాండల్ ( నేటి మచిలీపట్నం) తీరం నుండి వ్యాపారావకాశాల కొరకు అపుడపుడే విస్తరిస్తున్న చెన్నపట్నానికి వలస వెళ్ళిన గాజుల బలిజ కుటుంబీకుడే లక్ష్మీ నరసు చెట్టి. ఆయన తండ్రి సిద్దులు చెట్టి. గాజుల కుటుంబం అనతికాలంలోనే మద్రాసు నగర వాణిజ్య కుటుంబాల్లో ఒక ప్రముఖ కుటుంబంగా ఎదిగింది. అంతర్జాతీయ వ్యాపార సంబంధాల మూలంగా లక్ష్మీనరసు చెట్టికి వలస వ్యాపార, రాజకీయ సంస్థల కార్యాకలాపాలను అతి సమీపంగా పరిశీలించే అవకాశం దక్కింది. ఈ సూక్ష్మ పరిశీలనే ఆయన మానసిక, సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దృక్పధాల్లో మార్పు తెచ్చింది. ఆయనలో అఖండ స్వేచ్ఛాలాలస వుంది. తదనంతర కాలంలో ఆయన భవిష్యత్ నాయకులకు స్పష్టమైన కార్యాచరణను, రహదారి సూచికలను అందించగలిగాడు. 1830 దశకం నుండి 1860 దశకం వరకు ఆయన చేపట్టి నిర్వహించిన కార్యక్రమాలు నాటి దక్షిణ భారత ప్రజా జీవితంలో చరిత్రలో విస్మరింపరాని మైలురాళ్ళుగా మిగిలిపోయాయి.

బ్రిటిష్ వలసవాదులు, ప్రభుత్వం తమ అధికార అస్థిత్వ స్థిరీకరణకు భారతదేశంలో అనేక వివాదాస్పద కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. అందులో ప్రధానమైనవి ఆర్థిక దోపిడి, సాంస్కృతిక దాడి. ఈ రెంటిపై లక్ష్మీ నరసు చెట్టి తిరుగుబాటు శంఖారావాన్ని పూరించాడు. ముల్లును ముల్లుతోనే తీయాలనే నిశ్చయానికొచ్చాడు. దానికి కారణం, మనం ముందు పేర్కొన్నట్లు, ఆయన సునిశిత పరిశీలన, సూక్ష్మ విశ్లేషణ.

లక్ష్మీనరసు చెట్టి తన ఎదురుదాడిని సాంస్కృతికంగా ప్రారంభించాడు. మత మార్పిడులపై, హిందూ దేవాలయాల నిధుల మళ్లింపుపై ఆయన ఉద్యమించాడు. రాజ్య సహకారంతో క్రైస్తవ మిషనరీలు, సంస్థలు మత ప్రచారం, మార్పిడులను భారీస్థాయిలో చేపట్టారు. మరోవైపు హైందవ విశ్వాసాలపై దాడి ప్రారంభించారు. 19వ శతాబ్ధిలో ఇది ప్రస్పుటం. వారి ఆగ డాలు శృతిమించినపుడు దేశీయ సమాజం మొత్తం కదిలింది. దీనికి నాయకత్వం వహించినది గాజుల లక్ష్మీనరసు చెట్టి. 1840-50 మధ్యకాలంలో ఆయన మదరాసు నగర ప్రజానికాన్ని కదిలించాడు. అనేక బహిరంగ సభలను నిర్వహించాడు. 1846-47 మధ్యకాలంలో ఆయన వలస ప్రభుత్వ హైందవ హననంకు వ్యతిరేకంగా నిర్వహించిన సభకు పదివేల మందికి పైగా ప్రజలు హాజరైయ్యారని సమకాలీన ప్రభుత్వ నివేదికలే పేర్కొన్నాయి. “The Wrongs and Oppressions of Hindus” పేరిట ఆయన వలస పాలకుల దురాగతాలను, సాంస్కృతిక దాడిని ఎండగడుతూ ఒక మహజరును లండన్ పాలకులకు పంపాడు. ఈనాడు ఇది ప్రకంపనలను సృష్టించింది. సమకాలీన పరిస్థితుల్లో గాజుల లక్ష్మీనరసు చెట్టిది పెద్ద సాహసమే!.

ప్రచారం చేయలేని, సాధించలేని పనులేమీ లేవు. ఇది బాగా వంట పట్టించుకున్న మిషనరీలు ఆ దిశగా వడివడిగా ఆడుగులేశారు. ఇదొక సాత్విక మతాధార ప్రణాళిక. ఆ కార్యక్రమంలో భాగంగా పత్రికలు స్థాపించి, వాటిని మద్రాసు ప్రెసిడెన్సీ మొత్తంలో బట్వాడా చేసి, మత భావనలను ప్రజల మనస్సుల్లోనికి బలవంతంగా తీసుకు వెళ్ళే భారీ ప్రయత్నాలు ప్రారంభించారు. ఉదాహరణకు, మిషనరీ జాన్ అండర్సన్ స్థాపించి, నిర్వహించిన ‘రికార్డ్” అనే పత్రిక ఆనాటికీ దాదాపు 8000 కాపీలు రెసిడెన్సీలోని అన్ని ముఖ్య ప్రాంతాలకు చేరేవి. వీటి ఉదృతి చూసి స్థానిక హిందూ సమాజం తల్లడిల్లింది. ఈ ధోరణులకు అడ్డుకట్ట వేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేయాల్సివచ్చింది. ముల్లును ముల్లే సమాధానం. పత్రికమే పత్రికే విరుగుడు. మత హననానికి సహనం ఎల్లకాలం సమాధానం కాదు. ఈ నిశ్చయానికి వచ్చిన లక్ష్మీనరసు చెట్టి ఒక చారిత్రక భాద్యతను, మహాత్కార్యాన్ని భుజానికెత్తుకున్నాడు. ‘క్రెసెంట్’ అనే ఆంగ్ల పత్రికను స్థాపించాడు. వార్తా సేకరణకు ప్రప్రథమంగా పరిశోధక పాత్రికేయాన్ని (Investigative Journalism) ప్రవేశ పెట్టాడు. ఒక ఆంగ్లేయుడిని సంపాదకునిగా నియమించాడు.. వ్యాపారంలో తాను సంపాదించినదంతా పత్రిక నిర్వహరణకు ధారపోశాడు. అనతి కాలంలో ఆయన పత్రిక జాన్ ఆండర్సన్ పత్రికకు సమవుజ్జీగా నిలిచింది. 1845 – 1848 మధ్యకాలంలో ‘క్రెసెంట్’ పత్రిక కాపీలు దాదాపు పదివేలు మద్రాసు ప్రెసిడెన్సీలో బట్వాడా అయ్యేవని వలస అధికారులే తమ నివేదికల్లో పేర్కొన్నారు .. పత్రికలో ప్రచురించిన సంపాదకీయాలు త్వరలోనే వలస ప్రభుత్వంలో తీవ్ర అలజడి సృష్టించాయి. 1845 నాటికే ఒక సాధారణ హిందూ కుటుంబీకుడు ఇంత స్థాయిలో పోరాట పటిమను ప్రదర్శిసాడని వలసాధికారులు సైతం ఊహించలేదు. ఇలాటి కార్యక్రమాలను. పరిశోధక పాత్రికేయ ఒరవడిని విస్మరించి, ఉపేక్షిస్తే ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థక మౌతుందని గవర్నురు నుండి క్రింది స్థాయి ఉద్యోగుల వరకు ప్రతి చర్యలకు, ప్రతీకారానికి, పరోక్ష అణచివేతకు ద్వారాలు తెరిచారు. చాలా మంది స్థానిక హిందూ ఉద్యోగులను ప్రభుత్వోద్యోగాల నుండి తొలగించారు. ఒకానొక సందర్భంలో మద్రాసు గవర్నరుగా పనిచేసిన ధామస్ మన్రో ఒక విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నాడు. అదేమిటంటే – పత్రికా స్వేచ్ఛ, విదేశీయుల పెత్తనం ఒకదానితో ఒకటి పొసగదు. ‘క్రెసెంట్’ విషయంలో ఆయన భయాలు నిజమైనాయి. అనతి కాలంలోనే వలస ప్రభుత్వం పత్రికను అణిచివేసి, గాజుల లక్ష్మీనరసు చెట్టిపై అపరిమిత నిఘానుంచింది. సంపద కరిగి పోవడం, పత్రిక క్షీణించడం మొదలైన పర్యవసానాలు లక్ష్మీనరసు చెట్టిని పేదరికంలోనికి నెట్టాయి.

స్థానిక సంప్రదాయాలను, హైందవ ధార్మికతను కాపాడటానికి భయరహితంగా దక్షిణ భారతంలో ఉద్రమించిన శిఖరప్రాయుడు గాజుల లక్ష్మీనరసు చెట్టి. ఇంతటి పోరాటంలో కూడా ఆయన హింసకు తావులేని, లౌకిక కార్యాచరణ ద్వారానే తన కార్యక్రమాలను నిర్వాహించాడు. లక్ష్మీ పుత్రునిగా ఎదిగి, కుచేలునిగా మిగిలాడు. ఆయన శ్రమ, త్యాగం, సాంస్కృతిక వ్యక్తిత్వం భావితరాలకు శిరోధార్యం.